టీడీపీ ఎమ్మెల్యేపై క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు

ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే! నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చెప్పిందే వేదం! ఆయ‌న గీసిన గీత దాటితే ఇక అంతే సంగ‌తులు! భూవివాదాలా, ఆర్థిక వివాదాలా, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లా.. ఇలా స‌మ‌స్య ఏదైనా ఆయ‌న తీర్పు ఇచ్చాక ఇక దానికి తిరుగుండ‌దు! నియోజ‌క‌వ‌ర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుని.. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను అదుపాజ్ఞ‌ల్లో పెట్టుకుని సెటిల్‌మెంట్లు, దందాల‌కు మారుపేరుగా మారిన ఆ `రాయుడి`కి ఇప్పుడు ఎదురుదెబ్బ త‌గిలింది. వడ్డీ వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపుతామంటూ ఒక పక్క చంద్రబాబు ప్రకటనలు చేస్తూ, చట్టాలు తెస్తుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం సెటిల్ మెంట్లు చేస్తూ సెటిల్ అయి పోదామనుకున్నారో ఏమో ఇప్పడు ఇరుక్కుపోయి గిల‌గిలలాడుతున్నారు.

ఎవ‌రు అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డినా ఉక్కుపాదం మోపుతామ‌ని, ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌మ‌ని,, చంద్ర‌బాబు ఒక ప‌క్క స్ప‌ష్టంచేస్తున్నారు. కానీ మ‌రోప‌క్క అధినేత చెప్పిన‌వ‌న్నీ తమ‌కు వ‌ర్తించ‌వ‌ని, త‌మ రూటు సెప‌రేట‌ని చెబుతున్నారు

పీలా గోవింద్.. విశాఖ జిల్లా అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే! ఈ ఎమ్మెల్యే సెటిల్ మెంట్లలో సిద్ధ హస్తుడు. ఫైనాన్షియల్ సెటిల్ మెంట్లతో పాటుగా, భూ వివాదాలనూ ఆయనే పరిష్కరిస్తారు. ఆయనే ఒక ప్రత్యేక కోర్టు అందులో ఆయ‌నే జ‌డ్డి. ఆయనే న్యాయమూర్తి. తానే రాజు తానే మంత్రి! టోటల్ గా ఆయనే ఒక రాయుడు. భూ వివాదాలను, ఆర్థిక వివాదాలను పరిష్కరించడంలో దిట్టగా పేరుపొందారు. తన నియోజకవర్గంలో వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరిం చేస్తారు.

ప్రజాసమస్యలేకాదు వ్యక్తిగత సమస్యలు కూడా. తాను చెప్పిన తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే. లేకుంటే అక్రమ కేసులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తాడు. దీంతో అనేకమంది ఫైనాన్షియర్లు కూడా ఈ ఎమ్మెల్యేను ఆశ్రయించి తమ డబ్బులను వసూలు చేసుకుంటారు. అలాంటి పెదరాయుడికి ఎదురుదెబ్బతగిలింది. ఎమ్మెల్యే పీలా గోవింద్ నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ ఒక మహిళ, ఆమె కుమార్తె పోలీసులను ఆశ్రయించారు. అంతేగాక‌ ఏకంగా కమిషనర్ కే ఫిర్యాదు చేశారు. వడ్డీ వ్యాపారికి బకాయీ చెల్లించాలంటూ ఎమ్మెల్యే పీలా గోవింద్ తమను గృహ నిర్భంధం చేశారని అదాంబీ, ఆమె కుమార్తె పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో పెదరాయుడి బండారం బయటపడింది.

ఈ విషయాన్నిఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా అంగీకరించడం విశేషం. సమస్యను సెటిల్ చేయాలని తన వద్దకు ఇద్దరూ వచ్చారని, 16 లక్షల రూపాయలు వడ్డీ వ్యాపారికి అదాంబీ చెల్లించాల్సి ఉంటే తాను పది లక్షలకు సెటిల్ చేశానని ఎమ్మెల్యే నిర్భయంగా ఒప్పుకున్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎమ్మెల్యే పై కేసు పెట్టడంపై కాస్త ఆలోచిస్తున్నారు. మ‌రి సీఎం చంద్రబాబు చెప్పే నీతులు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు వ‌ర్తించ‌వా అనేది ఇప్పుడు స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌!!