2019 ఎన్నిక‌ల్లో పీత‌ల‌కు మ‌రోసారి “చింత‌ల‌పూడి ” టిక్కెట్టు వ‌స్తుందా ? డౌటేనా ?

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాల‌మ్‌లో ఈ రోజు టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మాజీ మంత్రి పీత‌ల సుజాత ప్రోగ్రెస్ ఎలా ఉంది ? ఆమెకు ఉన్న ప్ల‌స్సులు, మైన‌స్‌లు ఏంటో చూద్దాం. చింత‌ల‌పూడి పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట‌. గ‌తంలో మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు విజయం సాధించారు. ఇక టీచ‌ర్ అయిన పీత‌ల సుజాత 2004లో డెల్టాలోని ఆచంట నుంచి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2009లో ఆమెకు టిక్కెట్టు ద‌క్క‌క‌పోయినా పార్టీలోనే అంకిత‌భావంతో ఉండ‌డంతో చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో మెట్ట ప్రాంతంలోని చింత‌ల‌పూడి సీటు ఇవ్వ‌డంతో ఆమె ఘ‌న‌విజ‌యం సాధించారు.

ఎస్సీ+మ‌హిళా కోటాలో మంత్రి అయిన పీత‌ల సుజాత మంత్రిగా ఉన్న మూడేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి స్థాయిలో కాదు క‌దా…క‌నీసం ఎమ్మెల్యే స్థాయిలో అయినా చేసిన అభివృద్ధి లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాలుగా ఉన్న కీల‌క స‌మ‌స్య‌లు, అంత‌ర్గ‌త ర‌హ‌దారుల స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌వ‌సాయం కీల‌కం. ఇక్క‌డ రైతుల కోసం ఆమె చేప‌ట్టిన కీల‌క ప్రాజెక్టులు ఒక్క‌టంటే ఒక్క‌టీ లేవు.

ఇక మూడేళ్ల పాల‌నా కాలంలో సుజాత‌పై తీవ్ర‌స్థాయిలో అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. సుజాత బంధువులపై సైతం అవినీతి ఆరోప‌ణ‌ల‌కు లెక్కేలేదు. ఇక సుజాత ఇంట్లో ఓ మ‌హిళ డ‌బ్బు క‌ట్ట‌ల‌తో దొరికిపోవ‌డం, ప్ర‌కాశం జిల్లాలో మైనింగ్ వ్యాపారాల నుంచి ఆమెకు ఖ‌రీదైన బ‌హుమ‌తులు రావ‌డం, ఆమె శాఖ‌లో దిగువ‌స్థాయి ఉద్యోగుల‌తో ఆమె ప‌ర్య‌ట‌న‌ల‌కు చందాల దందా ఇలా సుజాత అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ఆమెతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు సైతం మ‌చ్చ రాక‌త‌ప్ప‌లేదు.

నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన ఏఎంసీ చైర్మ‌న్ ఇప్ప‌ట‌కీ నియ‌మించ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో సుజాత ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు యాంటీగా స‌ప‌రేట్ గ్రూప్ మెయింటైన్ చేయ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నిట్ట‌నిలువునా చీలింది. ఇక సుజాత తీరుతో విసిగిపోయిన చంద్ర‌బాబు సైతం ఆమె మంత్రి ప‌ద‌విని ఊస్టింగ్ చేయ‌క‌త‌ప్ప‌లేదు.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– మంత్రిగా మూడేళ్ల‌లో త‌న వ‌ర్గం వారికి కొన్ని చిన్న ప‌నులు ఇవ్వ‌డం

– నియోజ‌క‌వ‌ర్గానికి త‌ర‌చూ ట‌చ్‌లో ఉంటూ అన్ని మీటింగ్‌ల‌కు హాజ‌ర‌వ్వ‌డం

మైన‌స్ పాయింట్స్ (-):

– మంత్రిగా క‌నీస ప్ర‌భావం చూప‌క‌పోవ‌డం

– మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో ప‌ద‌వి ఊస్టింగ్‌

– నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఆజ్యం పోసి త‌న‌కంటూ ఓ వ‌ర్గం ఏర్పాటు చేసుకోవ‌డం

– ఎంపీ మాగంటితోను, విప్ ప్ర‌భాక‌ర్‌తోను తీవ్ర స్థాయి విబేధాలు

– తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల వ‌ల‌లో చిక్కుకోవ‌డం

– ఇప్ప‌ట‌కీ కీల‌క‌మైన ఏఎంసీ చైర్మ‌న్ పోస్టు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం

– పార్టీ కోసం ద‌శాబ్దాలుగా క‌ష్ట‌ప‌డిన వారిని విస్మ‌రించ‌డం

తుది తీర్పు:

ఈ మూడేళ్ల పాల‌నా కాలంలో పీత‌ల సుజాత ప్ల‌స్‌లు భూత‌ద్దంలో వెతుక్కోవాల్సి ఉంటే మైన‌స్‌లు మాత్రం లెక్క‌కు మిక్కిలిగా ఉన్నాయి. పీత‌లకు మంత్రి ప‌ద‌వి వ‌ల్ల అటు ప్ర‌భుత్వానికి ఏం ఒర‌గ‌లేదు స‌రిక‌దా..! ఇటు జిల్లాలోను పార్టీ బ‌ల‌ప‌డ‌లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో సైతం పార్టీ పురోగ‌మ‌న దిశ‌లో ఉంది. ఓ మంత్రిగా ఆమె క‌నీస స్థాయిలో కూడా ప్ర‌భావం చూప‌లేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు టీడీపీలోని సామాన్య కార్య‌క‌ర్త‌ల్లోనే వినిపిస్తున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీత‌ల‌కు మ‌రోసారి టిక్కెట్టు వ‌స్తుందా ? అన్న‌ది కూడా డౌట్‌గానే ఉంది. చంద్ర‌బాబు మ‌రోసారి ఆమెనే కంటిన్యూ చేస్తే నియోజ‌వ‌క‌ర్గంలో ప్ర‌స్తుతం ప‌రిణామాలను బ‌ట్టి ఆమె గెలుపు క‌ష్ట‌త‌రంగానే క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె దూరంగా పెట్టిన వ‌ర్గంతో పాటు ఎంపీ మాగంటి వ‌ర్గాలు ఆమె గెలుపున‌కు ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తాయ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది. ఇక చంద్ర‌బాబు రిపోర్టుల్లో సైతం ఆమెకు అంత మంచి మార్కులు లేవు. అందుకే ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు.