చింత‌ల‌పూడిలో టీడీపీ, వైసీపీకి కొత్త క్యాండెట్లేనా..!

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితేనే టీడీపీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్ల‌లోను టీడీపీయే గెలిచింది. ఈ జిల్లాలో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఓ ప్ర‌త్యేక‌త ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఇది కంచుకోట‌గా నిలుస్తూ వ‌స్తోంది. ఆ పార్టీ ఇక్క‌డ 2004, 2009లో ఓడిపోయినా 1600, 1100 ఓట్ల స్వ‌ల్ప తేడాతోనే సీటును కోల్పోయింది.

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం మాజీ మంత్రి పీత‌ల సుజాత ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. మంత్రిగాను, ఎమ్మెల్యేగాను మూడేళ్ల‌లో ఘోరంగా విఫ‌ల‌మైన సుజాత‌ను చంద్ర‌బాబు గ‌త కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో త‌ప్పించారు. నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు తీవ్రంగా ఉన్నాయి. సుజాత అవ‌గాహ‌నా రాహిత్య రాజ‌కీయానికి తోడు ఆమె గ్రూపుల దెబ్బ‌తో ఇక్క‌డ పార్టీ ఎంపీ వ‌ర్గంగాను, ఎమ్మెల్యే వ‌ర్గంగాను చీలిపోయింది. జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను ఏఎంసీలు ఓ విడ‌త పాల‌క‌వ‌ర్గం కంప్లీట్ చేసుకుని రెండోసారి ప‌నిచేస్తున్నా చింత‌ల‌పూడి ఏఎంసీ పాల‌క‌వ‌ర్గం ఇంకా నియామ‌కం కాలేదు.

సుజాత వ‌ర్సెస్ బాబు పోరుతో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బ్ర‌ష్టుప‌ట్టిపోయింది. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుజాతకు మ‌రోసారి ఇక్క‌డ సీటు ఇస్తే ఆమె గెలుపున‌కు తాము కృషి చేయ‌మ‌ని నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులు ఖ‌రాఖండీగానే చెప్పేస్తున్నారు. ఇక పార్టీ అధిష్టానం కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుజాత‌కు టిక్కెట్ ఇవ్వ‌ద‌న్న సంకేతాలు వ‌చ్చేస్తున్నాయి.

టీడీపీ నుంచి కొత్త క్యాండెట్ ఎవ‌రు..?

సుజాత‌కు టిక్కెట్ ఇవ్వ‌ర‌న్న సంకేతాలు రావ‌డంతో టీడీపీ నుంచి చాలామంది ఆశావాహులు టిక్కెట్ ఆశిస్తు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. జిల్లా ప‌రిషత్ మాజీ చైర్మ‌న్ కొక్కిరిగ‌డ్డ జ‌య‌రాజు, గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఆశించిన గుడిపూడి ర‌వి, ప్ర‌భుత్వ ఉద్యోగి కోట సూర్య‌ప్ర‌భాక‌ర్‌రావుతో పాటు మ‌రికొంద‌రు రేసులో ఉన్నారు. ఎన్నిక‌ల నాటికి వీరే కాకుండా చాలా కొత్త పేర్లు తెర‌మీద‌కు రానున్నాయి. 

ఇక పామ‌ర్రులో ఉప్పులేటి క‌ల్ప‌న టీడీపీలో చేర‌డంతో వ‌ర్ల రామ‌య్య‌ను స‌ర్దుబాటు చేసే క్ర‌మంలో కొవ్వూరు, లేదా చింత‌ల‌పూడి పేర్లు లైన్లో ఉన్నాయి. వ‌ర్ల రామ‌య్య  ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డైనా పోటీ చేసే ఛాన్స్ కూడా కొట్టిప‌డేయ‌లేం. కొవ్వూరు నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మంత్రి కేఎస్‌.జ‌వ‌హ‌ర్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కృష్ణా జిల్లా తిరువూరుకు వెళితే రామ‌య్య‌కు చింత‌ల‌పూడి, కొవ్వూరు రెండు ఆప్ష‌న్లు ఉంటాయి.అయితే చింత‌ల‌పూడి టీడీపీ క్యాడ‌ర్ మాత్రం స్థానికేత‌రుల‌కు స‌పోర్ట్ చేయ‌మ‌ని తెగేసి చెపుతోంది. మ‌రి ఎన్నిక‌ల నాటికి అధిష్టానం డెసిష‌న్ ఎలా ఉంటుందో ?  చూడాలి. సుజాత‌కు మాత్రం టిక్కెట్ రాద‌ని నూటికి నూరు శాతం ఖ‌రారైన‌ట్టే తెలుస్తోంది.

వైసీపీలోను అదే అనిశ్చితి:

నియోజ‌క‌వ‌ర్గంలో విప‌క్ష వైసీపీలోను అదే అనిశ్చితి నెల‌కొంది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాల రాజేష్ భార్య దేవిప్రియ పోటీ చేసి ఓడిపోయింది. ఆమె ఓట‌మి త‌ర్వాత రాజేష్ క్రియాశీలంగా లేక‌పోవ‌డంతో లింగ‌పాలెం మండ‌లానికి చెందిన దెయ్యాల న‌వీన్‌బాబును ఇన్‌చార్జ్‌గా జ‌గ‌న్ నియ‌మించారు. నవీన్‌బాబు క్రియాశీలంగా ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు మాత్రం గ్యారెంటీ లేద‌ని తెలుస్తోంది. 

నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలోను గ్రూపు రాజ‌కీయాలు తీవ్రంగా న‌డుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఘంటా ముర‌ళీ ఓ వ‌ర్గం గాను, ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కోట‌గిరి శ్రీథ‌ర్ మ‌రో వ‌ర్గంగాను రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇక ముర‌ళీ వ‌ర్గం నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగి జ‌య‌రాజు కూడా వైసీపీ టిక్కెట్ ఆశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఎలా ఉన్నా జ‌గ‌న్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌రిచ‌యాలు ఉన్నా మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాల రాజేష్ చివ‌రి క్ష‌ణంలో టిక్కెట్ రేసులోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని టాక్‌.

ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల వేళ చింత‌ల‌పూడి రాజ‌కీయం మాత్రం అంద‌రూ ఊహించిన దానికి భిన్నంగా ఉండేందుకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఇన్‌చార్జ్‌ల‌కు బ‌దులుగా కొత్త వారికే ఇక్క‌డ ఛాన్స్ ఉంటుంద‌నేది ఆయా పార్టీల అధిష్టానాన్ని బ‌ట్టి తెలుస్తోంది.