బాహుబ‌లికి పైర‌సీ క‌ష్టం

ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం విడుద‌లైన బాహుబ‌లి-2 అశేష ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగిస్తోంది. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్ర‌శ్న ఈ మూవీ మొత్తాన్ని న‌డిపిస్తోంది. ఇదే ప్ర‌శ్న‌కు జ‌వాబు తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ధియేట‌ర్ల వ‌ద్ద క్యూక‌ట్టారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌డు బాహుబ‌లి మూవీని క‌ట్ట‌ప్ప కాకుండా పైర‌సీ భూతం పొట్ట‌న‌పెట్టుకుంటోంద‌ని ప్ర‌భాస్ అభిమాన సంఘాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. గురువారం రాత్రే ప్రీమీయ‌ర్ మూవీ రిలీజ్ కావ‌డంతో ఈ సినిమాను ర‌హ‌స్యంగా సెల్ ఫోన్ల ద్వారా రికార్డు చేసిన కొంద‌రు పైర‌సీ రాయుళ్లు.. ప్ర‌స్తుతం దీనిని యూట్యూబ్‌లో కూడా పెట్టేశారు.

దీంతో దాదాపు బాహుబలి-2 మూవీ 50 నిమిషాల సినిమా నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. పోలీసులు, ఫ్యాన్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు. పైగా డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుండటంతో ఇంకెంత మందికి ఈ పైరసీ ప్రింట్ షేర్ అవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పైరసీ లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతుండటం మరింత కలవరపాటుకు గురిచేసే విషయం. సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ ప్రింట్ అందుబాటులోకి రావడం వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇన్నేళ్లుగా లక్షల మంది కష్టానికి ప్రతిరూపంగా తెరకెక్కిన ఈ సినిమా పైరసీని చూసి పొట్ట కొట్టొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కాగా, ఇంటర్నెట్‌ లో ఈ సినిమా సంబంధించి పైరసీ లింకులు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రాజమౌళి బృందం కోరింది. blockxpiracy.com, apfilmchamber.comలకు లింకులు పంపాలని విజ్ఞప్తి చేసింది. పైరసీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకు ‘బాహుబలి’ బృందం విజ్ఞప్తి చేసింది.