ఏపీ రాజ‌కీయాల‌కు టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై …. కారణం తెలిస్తే షాక్ !

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మార‌డంలో విచిత్రం ఏం ఉంటుంది…ఏపీలో విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలంద‌రూ వ‌రుస‌పెట్టి అధికార పార్టీ పంచెన చేరుతున్నారు. మ‌రి ఈ టైంలో అదే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పార్టీ మార‌డం ఏంటా అని మ‌నం బుర్ర‌బ‌ద్ద‌లు కొట్టుకుంటాం…మ‌రో షాక్ ఏంటంటే స‌ద‌రు టీడీపీ ఎమ్మెల్యే పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.

నెల్లూరు జిల్లాలోని కోవూరు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌న్న ఓ ఇంటర్న‌ల్ వార్త‌ను తెలుగు జ‌ర్న‌లిస్టు.కామ్ విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా సేక‌రించింది.

దివంగ‌త మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డికి పోలంరెడ్డి బినామి అన్న గుస‌గుస‌లు ఉన్నాయి. 2004లో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గాలిలో కోవూరు నుంచి గెలిచిన పోలంరెడ్డి 2009లో న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2012 కోవూరు బై ఎల‌క్ష‌న్‌లో పోటీ చేసి ఓడిపోవ‌డంతో పాటు ఏకంగా మూడో ప్లేస్‌లో నిలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసిన పోలంరెడ్డి న‌ల్ల‌పురెడ్డిపై విజ‌యం సాధించారు.

30 ఏళ్ల‌నాటి పోలంరెడ్డి ప్ర‌స్థానంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆయ‌న చూస్తోన్న వారు ఆయ‌న గురించి క‌థ‌లు క‌థ‌లుగా నెల్లూరు జిల్లాలో చెప్పుకుంటారు. ఇక మాధ‌వ‌రెడ్డికి నెల్లూరు జిల్లాలో ఉన్న ఆస్తుల‌కు కూడా ఆయ‌నే బినామి అన్న టాక్ ఉంది. ప్ర‌స్తుతం పోలంరెడ్డికి న‌ల్గొండ జిల్లాతో పాటు రంగారెడ్డి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కోట్లాది రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో సెటిల్ అవ్వాల‌ని, అక్క‌డ పొలిటిక‌ల్‌గా ప‌ట్టు సాధించాల‌ని భావిస్తోన్న పోలంరెడ్డి ఏపీ రాజ‌కీయాల‌కు దూర‌మ‌వ్వాల‌ని భావిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌వర్గాల స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పోలంరెడ్డి న‌ల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావును క‌లిసిన‌ట్టు టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి లేదా కొత్త‌గా ఏర్ప‌డే ఘ‌ట్‌కేస‌ర్ నియోజ‌క‌వ‌ర్గం సీటు త‌న‌కు ఇవ్వాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు స‌మాచారం.

ఒక‌వేళ పోలంరెడ్డి నెల్లూరులోనే ఉండి టీడీపీలో ఉన్నా కూడా ఆయ‌న‌కు టీడీపీ సీటు రాద‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఘ‌ట్‌కేస‌ర్ స‌మీపంలో ఆయ‌న‌కు ఉన్న విలువైన వ్యాపారాల దృష్ట్యా పోలంరెడ్డి అక్క‌డ క‌న్నేసిన‌ట్టు స‌మాచారం.