టీడీపీ-వైసీపీ మ‌ధ్యలో న‌లుగుతోన్న మ‌హేశ్‌

ఇటీవ‌ల విడుద‌లైన‌ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స్పైడ‌ర్ టీజ‌ర్ దుమ్మురేపుతోంది. ఈ సినిమా కంప్లీట్ చేసి.. త్వ‌ర‌గా కొర‌టాల శివ డైరెక్ష‌న్లో మ‌రో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు సూప‌ర్ స్టార్‌! అయితే రాజ‌కీయాలు, వివాదాలు ఎప్పుడూ దూరంగా ఉండే మ‌హేశ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిప‌డింది. సినిమాల విష‌యంలో అని కంగారు ప‌డ‌కండి.. రాజ‌కీయాలకు సంబంధించి!! అటు బావ‌, ఇటు బాబాయ్ ఎవరు ముఖ్య‌మో తేల్చుకోలేని సందిగ్థంలో ప‌డిపోయాడ‌ట మ‌న ప్రిన్స్‌!! టాలీవుడ్‌లో మ‌హేశ్ క్రేజ్ అంతా ఇంతాకాదు. అందుకే ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టినుంచే సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ త‌రుణంలోనే మ‌హేశ్ కోసం టీడీపీ, వైసీపీ ప్ర‌య‌త్నిస్తున్నాయి.

సినిమా స్టార్స్ పాలిటిక్స్ లోకి రావ‌డం సాధార‌ణంగా మారిపోయింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ ఏకంగా పార్టీనే పెట్టి.. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మైపోతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే రాజకీయ పార్టీలు సినిమా స్టార్స్ కోసం వెంపర్లాడుతున్నాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీల కన్ను ప్రిన్స్ మహేశ్ పై పడ్డాయి. మహేశ్ టాలీవుడ్ సూపర్ స్టార్. ప్రేక్షకాదరణలోకానీ, బాక్సాఫీస్ వసూళ్లలోకానీ ఇప్పుడు మహేశ్ టాప్ లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు మహేశ్ ను తమ పార్టీ తరపున ప్రచారం చేయించుకునేందుకు వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది.

మహేశ్ బాబాయ్ ఆదిశేషగిరి రావు కాంగ్రెస్ లో చాలాకాలం కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఏదైనా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. మ‌హేశ్‌కు స్వ‌యానా బావ‌. గ‌త ఎన్నిక‌ల్లో జ‌య‌దేవ్ త‌ర‌ఫున ప్ర‌చారానికి రాక‌పోయినా.. ట్విట‌ర్ ద్వారా త‌న మ‌ద్ద‌తు తెలిపాడు మ‌హేశ్‌. దీంతో మ‌హేశ్‌.. కూడా త‌న బావ ప్ర‌చారంలో పాల్గొన్న‌ట్లే అయింది. దీంతో ప‌రోక్షంగా తెలుగుదేశం పార్టీతో వియ్యమొందారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ సొంతంగా బ‌రిలోకి దిగుతుండ‌టంతో.. ఇప్పుడు టీడీపీ మ‌హేశ్ వైపు చూస్తోందని తెలుస్తోంది.

గల్లా జయదేవ్ ను ఓడించాలంటే ఈసారి గుంటూరు నుంచి ఆదిశేషగిరి రావును బరిలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఒక‌ప‌క్క బాబాయ్ ఆదిశేష‌గిరిరావు వైసీపీ నుంచి, ఇటు బావ గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ నుంచి పోటీకి దిగుతుండ‌టంతో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే అంశంపై మ‌హేశ్ సందిగ్థంలో ఉన్నార‌ట‌. మ‌హేశ్ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చినా వారి వైపు విజ‌యం ఖాయం! ఇప్పుడు ఇదే విష‌యంలో మ‌హేశ్ నలిగిపోతున్నార‌ట‌. రెండు పార్టీల మధ్యలో కుటుంబం నలిగిపోవడం, కుటుంబంలో చిచ్చు రేగడం మహేశ్ కు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతున్నారు. అందుకే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇప్పుడున్నట్లే ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.