టీడీపీతో పొత్తుకు టీ కాంగ్రెస్‌లో వార్‌

వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజ‌కీయాలు చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఏపీలో జ‌న‌సేన ఎంట్రీతో టీడీపీ – వైసీపీ – జ‌న‌సేన మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్‌కు తెర‌లేస్తోంది. ఇక బీజేపీ – టీడీపీ మ‌ధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అన్న దానిపై కూడా ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే పొరుగు తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో నిన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ దూకుడుతో వార్ వ‌న్‌సైడ్‌గానే ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు అక్క‌డ కూడా రాజ‌కీయం రంగులు మారుతూ కొత్తగా యూట‌ర్న్ తీసుకునే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ‌లో టీఆర్ఎస్ / కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల‌న్ని ఒకొక్క‌టిగా ఒక్క‌ట‌య్యే ఛాన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. బీజేపీ -టీడీపీతో పొత్తు తెలంగాణ‌లో ఉండ‌ద‌ని చెప్ప‌డంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల‌కు యాంటీగా టీడీపీ-కాంగ్రెస్ క‌లిసే ఛాన్సులు ఉన్నాయి.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణలో టీడీపీతో పొత్తుపై పునర్ ఆలోచిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. తాము బీజేపీతో పొత్తుపై ఆస‌క్తిగా లేమ‌ని, తాము అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్‌తో క‌లిసి ముందుకు సాగే అంశంపై ఆలోచ‌న చేస్తున్న‌ట్టు చెప్పి బీజేపీకి షాక్ ఇచ్చారు.

రేవంత్ వ్యాఖ్య‌ల‌పై టీ కాంగ్రెస్‌లో అనుకూల వ‌ర్గాలు వ‌ర్సెస్ వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఫైటింగ్ జ‌రుగుతోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. తాము టీఆర్ఎస్‌, బీజేపీ త‌ప్ప మిగిలిన పార్టీల‌తో అనుకూలంగానే ఉంటామ‌న్నారు. టీడీపీతో పొత్తుకు త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఆయ‌న చెప్పారు. అయితే జైపాల్ వ్యాఖ్య‌ల‌ను ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి ఖండించారు.

టీడీపీతోను, ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుల‌పై మాట్లాడే అధికారం జైపాల్‌కు ఎవ‌రు ఇచ్చారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల వేళ పార్టీని బ‌లోపేతం చేయాల్సిన టైంలో ఆయ‌న వ్యాఖ్య‌లు బ‌ల‌హీన‌ప‌రిచేలా ఉన్నాయ‌న్నారు. బీజేపీతో భాగస్వామిగా ఉన్న టీడీపీతో పొత్తు ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. ఏదేమైనా తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి ప‌రిణామాలు అయినా జ‌రిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.