అమాంతం ప‌డిపోయిన టీడీపీ నేత గ్రాఫ్‌

పార్టీలో ర్యాకింగ్స్ ఎప్పుడూ కీల‌క‌మే! ఎవ‌రెవ‌రు ఏఏ స్థానాల్లో ఉన్నారో దానిని బట్టే ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఒకప్పుడు అధ్య‌క్షుడి త‌ర్వాత నిలిచిన వారే.. త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించకుండా మాయ‌మైపోతారు. ప్రస్తుతం టీడీపీ నేత ప‌య్యావుల కేశ‌వ్ ప‌రిస్థితి కూడా ఇలానే మారింది. గ‌తంలో పార్టీలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న హ‌వా ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ ఆయ‌న‌న్ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణాలు కూడా లేకపోలేద‌నేది పార్టీ వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం తీవ్రంగా సాగుతున్న త‌రుణంలో ప‌య్యావు కేశ‌వ్ వాణి బ‌లంగా వినిపించేది. పార్టీ త‌ర‌ఫున చాలా కీల‌కంగా క్రియాశీలంగా ఉండేవారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత టీడీపీ జాతీయ పార్టీ అయింది. జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు మారారు. దీంతో ఏపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌దవిని ప‌య్యావుల‌కే ఇస్తార‌ని అప్ప‌ట్లో అనుకున్నారు. ఎందుకంటే, పార్టీలో దాదాపు నంబ‌ర్ 2 స్థానంలో ప‌య్యావుల ఉండేవారు. ఓర‌క‌రంగా ఆ క్రియాశీల‌తే అప్ప‌ట్లో ప‌య్యావుల అవ‌కాశాల‌కు గండికొట్టాయ‌ని అనేవారూ లేక‌పోలేదు!

అయినా అప్పుడు ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న‌ కాస్త నిరాశ గుర‌య్యారు. గ‌తంలో మాదిరిగా యాక్టివ్ గా క‌నిపించ‌లేదు. ఒక ద‌శ‌లో వైకాపాలో చేరిపోతార‌న్న ప్ర‌చారం కూడా సాగింది. కానీ, ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి ప‌య్యావుల‌కు గుర్తింపు ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ క్ర‌మంలోనే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశిస్తే, గ‌త‌మే మ‌రోసారి పునరావృతం అయింది. ప్ర‌స్తుతం ఆయ‌న టాప్‌-10లో కూడా లేర‌నే విష‌యం దీంతో అర్థ‌మైంది. కొంత‌మంది నేత‌లు చురుకుగా దూసుకుపోతున్నా.. అనుకున్నంత స్థాయిలో ఉండటం లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నార‌ని గుస‌గుస‌లాడుతున్నాయి.

ప్ర‌స్తుతం ఆయ‌న పార్టీలో కీల‌క ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఎదురుచూస్తున్న‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ ఆ కీల‌క ప‌ద‌వి ఏంటంటే… పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి. ఇంత‌వ‌ర‌కూ కిమిడి క‌ళా వెంక‌ట్రావు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆయ‌న మంత్రి వ‌ర్గంలోకి రావ‌డంతో అధ్య‌క్ష ప‌ద‌వి ఖాళీ అయింది. దీంతో ఆ స్థానం త‌న‌కు ద‌క్కుతుంద‌ని ప‌య్యావుల ఆశిస్తున్న‌ట్టు స‌మాచారం. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోయినా, రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి క‌చ్చితంగా వ‌స్తుంద‌ని భావిస్తున్నార‌ట‌. కానీ ఆ ప‌ద‌వి ప‌య్యావుల‌కు క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉన్నాయ‌ట‌.