ఎన్టీఆర్ చుట్టూ స‌మాధానంలేని ప్ర‌శ్న‌లెన్నో

2009 ఎన్నిక‌ల తర్వాత‌ నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అలానే ఉన్నా.. స‌డ‌న్‌గా ఎలా వ‌చ్చిందో తెలియ‌దు కానీ ఎన్టీఆర్ పేరు మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న‌వ భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్టీఆర్‌.. పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని చెప్పినా.. మ‌రి ఎన్టీఆర్ పేరు వినిపించ‌డం వెనుక‌ ఏ శక్తులు ఉన్నాయి? ఎందుకు మ‌ళ్లీ ఎన్టీఆర్‌ను బుర‌ద‌లోకి లాగాల‌ని చూస్తున్నారు? ఎందుకు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు అంద‌రినీ వెంటాడుతున్నాయి.

వ‌రుస‌గా హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. అంతేగాక ఎన్న‌డూ లేనంతా.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వ్యాపిస్తున్నాయి. ఇక పవ‌న్ క‌ల్యాణ్‌కు పోటీగా ఎన్టీఆర్ పార్టీ పెట్టాడ‌నే ప్ర‌చారం విప‌రీతంగా జ‌రుగుతోంది. 2009 ఎన్నికల్లో ముందు వరకూ కూడా తెలుగు నాట రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించలేదు. వైఎస్సార్, చిరంజీవి, పవన్ ల హోరులో చంద్ర‌బాబుకు ఎన్టీఆర్ లాంటి నాయకుడి అవసరం పడింది. ఆ ఎన్నిక‌ల్లో తన ప్రసంగాలతో ఆక‌ట్టుకున్నాడు. ప్రాణాల మీదకు తెచ్చిన యాక్సిడెంట్ తర్వాత కూడా స్ట్రెచర్ పై నుంచి ప్ర‌చారం చేశాడు.

2009 ఎన్నికల తర్వాత తన తప్పు ఏమీ లేకపోయినా ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు ఎన్టీఆర్‌! ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు అనే స్థాయిలో ఎన్టీఆర్ పైన బురదచల్లారు. 2009 ఎన్నికల తర్వాత కూడా రాజకీయంగా క‌నిపించ‌ని ఎన్టీఆర్.. ముఖ్యమంత్రి కుర్చీని టార్గెట్ చేశాడు అని చెప్పి అబద్ధపు ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? నారా లోకేషే ఎన్టీఆర్ మనవడిని అని ప్రొజెక్ట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం కావాలని తారక్ కోరుకుంటే అందులో తప్పేముంది? ఒక వర్గానికి, తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్‌ని దూరం చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు.

ఇక ఇప్పుడు మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ అంటూ ప్రచారం లేపారు. నవభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ పేరు ఉన్న లెటర్ హెడ్‌ని సాక్ష్యంగా చూపించారు. ఒకవేళ పార్టీ స్థాపించి, రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే ఆ విషయం మీడియా వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? తన కెరీర్, తన సినిమాల వ్యవహారం చూసుకుంటున్న ఎన్టీఆర్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అయినా ఎందుకు దుష్ప్రచారం చేశారు? ఎన్టీఆర్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? అనేవి ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లు!