ఈసారి చంద్రబాబు దెబ్బ అదుర్స్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హైదరాబాద్‌ నుంచి ఉద్యోగుల్ని తరలించే అంశంపై తలెత్తుతున్న వివాదాన్ని భలేగా డీల్‌ చేశారు. పెర్‌ఫెక్ట్‌ టైమింగ్‌లో ‘స్థానికత’ అంశాన్ని ప్రయోగించారు. ఎప్పటినుంచో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న స్థానికత అంశంపై చంద్రబాబు క్లారిటీ తీసుకురాగలిగారు. జూన్‌ 2, 2017 నాటికి ఆంధ్రప్రదేశ్‌కి ఎవరైతే వెళతారో వారంతా అక్కడి స్థానికతను పొందుతారని చంద్రబాబు ఇదివరకే చెప్పారు. దానికి కేంద్రం ఆమోద ముద్ర వెయ్యవలసి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం ఇటీవల ఆ దస్త్రాన్ని పంపగా, పని పూర్తయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించి, గెజిట్‌లో స్థానికత అంశం ప్రచురితమయ్యింది.

ఇక ఇప్పుడు ఉద్యోగులు అమరావతికి వెళ్ళబోమని చెప్పడానికి వీల్లేదు. 2017, జూన్‌ 2 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులంతా అమరావతికి తరలి వెళ్ళిపోవాలి. అంటే, ఇప్పటినుంచే ప్రక్రియ ప్రారంభమైపోవాలి. ఇంకో నెల రోజుల్లో దాదాపుగా ఉద్యోగులంతా అమరావతికి వెళ్ళిపోవచ్చు. కొన్ని కారణాలతో కొంతమంది ఆగిపోవాల్సి వస్తే, వారికి మాత్రమే 2017 వరకు అవకాశం కల్పిస్తారు. ఉద్యోగులే కాదు, సామాన్యులకి కూడా ఇది వర్తిస్తుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులు కూడా స్థానికత కోసం ఆంధ్రప్రదేశ్‌కి పరుగుల పెట్టక తప్పదు.