నారాయణా చాలించు నీ అమరావతి లీలలు.

అంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుపై ఆరు నెలలుగా అదిగో.. ఇదిగో.. అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన పూర్తయిన వెంటనే గత డిసెంబరు 31 నుంచి ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అప్పట్నించి ఇప్పటవరకూ వాయిదాల పరంపర కొనసాగుతోంది. తరువాత జనవరి 31 నుంచి అని ఒకసారి, మార్చి 31 నుంచి అని మరోసారి, మే 31 నుంచి అంటూ ఇంకోసారి ప్రకటించారు. చివరిగా ఈనెల 10 నుంచి ఒకసారి.. కాదు 15 నుంచి ఇస్తామని మరోసారి ప్రకటించారు. ఇలా ఇష్టానుసారంగా తేదీలు ప్రకటిస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. అసలు ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి చేయాల్సిన మౌలిక పరమైన పనులు చేయకుండా కేవలం కంప్యూటర్లలో డిజైన్లు చూపుతూ కాలక్షేపం చేస్తున్నారు.

ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికవ్వాల్సి ఉందని గతంలో ప్రకటించిన అధికారులు, మంత్రులు ఇంతవరకూ ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా రైతులను మభ్య పెడుతూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. రైతులకు ప్లాట్లు ఎక్కడిస్తారో తెలపకుండా అయోమయాన్ని సృష్టిస్తు న్నారు. ప్రధానంగా మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం గ్రామాల్లో నిర్దేశించిన రెసిడెన్షియల్‌ జోన్‌, వాణిజ్య జోన్లల్లో రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇందుకు గ్రామాల వారీగా ప్లాట్లు కేటాయిం చాలి. ఈ క్రమంలో ప్రాథమికంగా చేయాల్సిన కర్తవ్యాలను ప్రభుత్వం ఇంకా పట్టించుకోవడం లేదు. ప్లాట్ల కేటాయింపునకు వీలుగా మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక, భూమి చదును పనులు, భూమి అభివృద్ధి, లే అవుట్‌ డిజైన్‌ పూర్తయిన తరువాత రైతుల పేర్లతో లాటరీ తీసి ప్లాట్లు కేటాయించాలి. లేదా రైతులు ఇచ్చిన ఆప్షన్‌ ప్రకారం వారు కోరిన ప్రదేశంలో ప్లాట్లు ఇవ్వాలి.

ఇలా చేయడానికి ముందస్తుగా చేయాల్సిన కసరత్తును ఎప్పటికి పూర్తి చేస్తారనేది అధికారులు స్పష్టం చేయడం లేదు. భూ సమీకరణ ప్రక్రియ గతేడాది ఫిబ్రవరి 28న అధికారికంగా ముగిసింది. ఆయితే ఇప్పటివరకూ అనధికారికంగా కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 28న సమీకరణలో భూములివ్వని రైతులను మభ్య పెట్టేందుకు హడావుడిగా అధికారులు, మంత్రులు నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, అనంతరం తదితర గ్రామాల్లో భూమి చదును పనులు చేపట్టారు. గ్రామానికి 100 ఎకరాల్లో చదును చేసి మమ అనిపించారు. కానీ ఆ తరువాత మళ్లీ వీటి జోలికి పోలేదు. రైతులకు సత్వరం ప్లాట్లు కేటాయించి మిగతా భూములను ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు కేటాయిస్తే నిర్మాణాలు ప్రారంభమై రాజధానికి ఒకకళ వస్తుందనేది నిపుణుల వాదన.