ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే  క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది.

కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను రచిస్తున్న బిజెపి సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగు తోంది. ఏపీకి ప్రత్యేకహోదా నరేంద్రమోడీ ఇచ్చి తీరాలన్న పవన్ కళ్యాణ్ కేంద్రం లోని బిజెపి సర్కార్ ఇస్తుందన్న నమ్మకాన్ని కూడా వ్యక్తంచేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తప్పుచేస్తుందని తాను భావించడంలేదని తిరుపతి సభలో పవన్ కళ్యాన్ వెల్లడించారు. ఇవ్వకపోతే మాత్రం ఊరుకోనని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర బిజెపి ఇన్‌ఛార్జ్ సిధార్థ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పవన్ కళ్యాన్ తమ పార్టీని ఎక్కడా టార్గెట్ చేయలేదు, విమర్శించలేదు అని వివరణ ఇచ్చారు.

మరోవైపు ఏపీ కేబినేట్‌లో కొనసాగుతున్న బిజెపికి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై చంద్రబాబు, నరేంద్రమోడీ, పవన్ కళ్యాన్ మాట్లాడమే భావ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దంతా ఓ వ్యూహాత్మ కంగా బిజెపి తెరచాటు రాజకీయం నడుపుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. హోదా పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ముద్రవేసుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ ముద్రవల్ల భవిష్యత్తులో అధికార భాగస్వాములైన టిడిపి, బిజెపి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్నది రాజకీయవర్గాల వాదన.

అయితే పవన్ కళ్యాన్ రంగ ప్రవేశంతో ఏపీకి ప్రత్యేకహోదాపై సాగుతున్న పోరాట క్రెడిట్ ఏకపక్షంగా ఎవరి ఖాతాలోకి వెళ్లకుండా ఉండే పరిస్థితులు ఉత్పన్నంకావచ్చన్నది రాజకీ యవర్గాల అభిప్రాయం. అలా వ్యతిరేకత ఓట్లలో చీలకవస్తే అధికారపక్షానికి ఎంతో కొంత మేలు జరుగుతుందన్నది కూడా ఓ వాదన వుంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ ఏపీకి ప్రత్యేకహోదా కోసం గళం ఎత్తిన కొన్ని రోజుల్లోనే ఏపీకి మెరుగైన ప్యాకేజీ కేంద్రం ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. తద్వారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గళానికి కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రధాన్యత ఇస్తున్నట్లు సంకేతాలు పంపుతోంది. అంటే ఏపీలోని ఇతర ప్రతిపక్ష పార్టీల గళానికంటే పవన్ గళానికే ప్రధాన్యత ఉందన్న సంకేతాలు వెలువడేలా బిజెపి ఓ వ్యూహం ప్రకారం పావులు కదుపుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి..