బాబుకు ఆ ముగ్గురు యాంటీ అవుతున్నారా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విప‌క్షాల నుంచే కాకుండా మిత్ర ప‌క్షం అనుకుంటున్న జ‌న‌సేనాని నుంచి కూడా కాక త‌గ‌ల‌నుందా?  అటు ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, కామ్రేడ్లు స‌హా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూకుమ్మ‌డిగా బాబుపై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన గోదావ‌రి ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చంద్ర‌బాబు కొంప‌మీద‌కు వ‌స్తోందా? అంటే ఔన‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మ‌త్య్స కారుల‌కు అనువైన స‌ముద్ర ఉత్ప‌త్తుల ప్రాసెసింగ్ యూనిట్‌ను భారీ ఎత్తున ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లం తుందుర్రులో ఏర్పాటు చేస్తోంది.

ఇప్ప‌టికే పిల్ల‌ర్లు స‌హా ప్ర‌ధాన ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, ఈ యూనిట్ ఏర్పాటును స్థానికంగా ఉన్న వంద‌ల మంది రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. కానీ, కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు చంద్ర‌బాబు ఈ వ్య‌వ‌హారాన్ని అత్యంత ప‌టిష్టంగా కానిచ్చేస్తున్నారు. పోలీసులు, భ‌ద్ర‌తా సిబ్బందిని పెట్టి నిర్మాణ ప‌నులు చేయిస్తున్నారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వ‌చ్చే వ్య‌ర్థ‌జ‌లాల‌ను స‌మీపంలోని ప్ర‌ధాన కాలువ‌లోకి వ‌ద‌ల‌డం వ‌ల్ల పొలాలు బీడులుగా మారిపోతాయ‌ని చెబుతున్నారు. ఈ పార్కు వల్ల 35 గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయని, తాగు సాగు నీటి వనరులు కలుషితమై జీవితాలే దెబ్బతింటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నార‌ని రైతులు అంటున్నారు.

అయితే, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం వీరి ఆవేద‌న‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే ముందుకు వెళ్తోంది. దీనిపై ఇప్ప‌టికే క‌మ్యూనిస్టులు క‌దం తొక్కారు. గురువారం సీపీఎం జాతీయ స్థాయి నేత బృందాక‌ర‌త్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న కు వ‌చ్చారు.  భీమవరం పాత బస్టాండ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను ఉల్లంఘిస్తూ ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం దారుణమని దుయ్యబట్టారు. ప్రజల అంగీకారం లేకుండా పార్క్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించా రు.

ఫుడ్‌పార్క్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆధైర్యంతో కన్నీరు పెట్టుకోకుండా, ప్రభుత్వంపై పోరాడి చంద్రబాబుకు కంటనీరు తెప్పించాలని పిలుపునిచ్చారు. మ‌రోప‌క్క‌, ఇక్క‌డి రైతులు రెండు రోజుల క్రితం హైద‌రాబాద్‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రించారు. వ‌చ్చి త‌మ‌ను ఆదుకోవాల‌ని కూడా వారు కోరారు. దీనికి ప‌వ‌న్ అంగీక‌రించారు. అభివృద్ధి అంటే ప్ర‌జ‌ల‌ను ఏడిపించ‌డం కాద‌ని ఈ సంద‌ర్భంగా ఘాటుగానే ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో రానున్న రోజుల్లో ప‌వ‌న్ తుందుర్రుకు వెళ్లి రైతుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి ఆయ‌నను చంద్ర‌బాబు మిత్ర‌ప‌క్షంగా భావిస్తున్నారు. అందుకే ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలుగా పోల్చినా బాధ‌ను దిగ‌మింగుకున్నారు. మ‌రి ఇప్పుడు ఆక్వా విష‌యంలో ప‌వ‌న్ రెచ్చిపోతే.. ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి,. ఇక‌, ప్ర‌ధాని విప‌క్షం వైకాపా నేత‌లు ఇప్ప‌టికే ఆందోళ‌న‌లు స‌హా అటు సాక్షి మీడియాలో ఈ ఆక్వా పార్క్‌పై ప్ర‌త్యేక క‌థ‌నాలు వండివారుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో బాబుకు యాంటీగా జ‌న‌సేన‌, వైకాపా, కామ్రేడ్లు క‌ల‌సిక‌ట్టుగా క‌దం తొక్కే ఛాన్స్ క‌నిపిస్తోంది.

ఇదే జ‌రిగితే.. ఒక‌ప్ప‌టి విద్యుత్ ఉద్య‌మం త‌ర‌హా ఉద్య‌మం పురుడు పోసుకోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి ప‌రిస్థితి అంత‌దాకా తెస్తారా?  లేదా మ‌ధ్య‌లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా?  చూడాలి. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. విప‌క్షాల ఆందోళ‌న‌ల‌ను గ‌మ‌నించే కాబోలు ఏపీలో ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థ‌లు గురువారం నుంచి ద‌ఫ‌ద‌ఫాలుగా ఈ ప్లాంట్ ఏర్పాటుపై అనుకూల క‌థ‌నాలు, అభిప్రాయాలు, ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి.