సెల్ఫ్ డిఫెన్స్ లో ఏపీ సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ఒక్కసారిగా సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఎదురవుతున్న అన్నీ సమస్యలనూ తానే చూసుకోవాల్సి రావటంతో సిఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కేంద్రంగా ఉభయగోదావరిలో ఉద్రిక్తత. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసపెట్టి మాటల దాడులు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎంఎల్ఏలు ఆరోపణలు, విమర్శలు, ఇంకోవైపు హైదరాబాద్‌లోని సచివాలయం నుండి విజయవాడ ప్రాంతానికి తరలి రావటానికి ఇష్టపడని ఉద్యోగులు. ఇన్ని సమస్యల మద్య చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇందులో ఏ ఒక్క సమస్య పరిష్కారం కూడా చంద్రబాబు చేతిలో లేదు. కాకపోతే అన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుదే. అందుకనే సిఎం బాగా ఇబ్బంది పడుతున్నారు.

కొద్ది నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో జరిగిన కాపు గర్జన బహిరంగ జరిగింది. ఆ సందర్భంలో కొందరు ఆందోళనకారులు సభా వేదికకు కొద్ది దూరంలోనే ఆగివున్న రత్నాచల్ రైలుబోగీలకు నిప్పు పెట్టారు.దాంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసారు. కొన్ని మాసాల పాటు ఈ కేసును అడ్డంపెట్టుకుని అధికారపార్టీ అటు ముద్రగడతో పాటు ఇటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద కూడా పలు ఆరోపణలు చేసింది. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు జరిపించకుండా ఘటనకు జగన్మోహన్‌రెడ్డే కారకుడంటూ ముఖ్యమంత్రి మొదలు పలువురు మంత్రులు ఏకపక్షంగానే తేల్చేసారు. ఘటనను అడ్డుపెట్టుకుని ముద్రగడను ఇబ్బందులు పెడదామని అధికార పార్టీ ఎంతో ప్రయత్నాలు చేసింది. రైలు దహనం కేసులో ఎటువంటి సంబంధంలేని అమాయకులను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందంటూ మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. దాంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్ధం కాక ప్రభుత్వం ఇపుడు తలపట్టుకున్నది.

ఇక, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రిని తన చిత్తానికి వచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు హామీలిచ్చి అమలు చేయకుండా చేసానని అబద్దాలు చెబుతున్న ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టమని, చీపుర్లు చూపించమని మరోసారి జగన్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, పార్టీ మొత్తం జగన్ చేసిన వ్యాఖ్యలపైనే మండిపడుతున్నారు. గడచిన నాలుగు రోజుల నుండి అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రజా సమస్యలు గాలికిపోయి కేవలం చెప్పులు, చీపుర్లే ప్రస్తావనలో నిలుస్తున్నాయి. ఇదే అదునుగా ప్రతిపక్ష వైసీపీకి చెందిన పలువురు శాసనసభ్యులు కూడా చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఐటి రంగానికి తానిచ్చిన స్పూర్తితోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ళ ఐఏఎస్ అధికారిని అవుదామని అనుకుని కూడా ఐటి రంగంలోకి ప్రవేశించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికే సత్యా నాదెళ్ళ మూడెళ్ళకు ముందే మైక్రోసాఫ్ట్ సంస్ధలో చేరినట్లు వైసీపీ ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దాంతో బుగ్గన కౌంటర్‌పై ఎలా స్పందించాలో అర్ధం కాకుండా చంద్రబాబు, టిడిపి నేతలు మౌనాన్నే ఆశ్రయించారు.

చివరగా హైదరాబాద్‌లోని సచివాలయం ఉద్యోగుల తరలింపు వ్యవహారం కూడా చంద్రబాబును బాగానే ఇబ్బంది పెడుతోంది. రాజధాని గ్రామాల్లో ఒకటైన వెలగ పూడిలో ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం నిర్మిస్తోంది. ఈనెల 27వ తేదీకల్లా హైదరాబాద్‌లోని సచివాలయంతో పాటు విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారంతా విజయవాడ ప్రాంతానికి వచ్చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి గట్టిగా చెబుతున్నారు. అయితే, వాస్తవమేమిటంటే వెలగపూడిలో నిర్మాణదశలోని భవనాలు పూర్తి కావటానికి ఇంకా సమయం పడుతుంది. ఈనెలలోపు ఎట్టి పరిస్దితుల్లోనూ పూర్తి కాదు. వాస్తవం ఇలాగుంటే మరి చంద్రబాబు ఎందుకు తరలింపుపై పట్టుపడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. దాంతో నిర్మాణాలను పరిశీలించి వచ్చిన ఉద్యోగ సంఘ నేతలు మాత్ర భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత కానీ తాము హైదరాబాద్ నుండి తరలి రామంటూ చంద్రబాబుకే గట్టిగా చెబుతున్నారు. దాంతో వారిని వెలగపూడికి ఏ విధంగా రప్పించాలో అర్ధంకాకుండా చంద్రబాబు తలపట్టుకున్నారు. తనంతట తానుగా తలమీదకు తెచ్చుకున్న సమస్యలతో పరిష్కారం కనబడక చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.