అనంత టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆ ఐదుగురు ఔట్.. !

January 20, 2018 at 11:17 am
Anantapur

అధికార టీడీపీకి అంత్యంత ప‌ట్టున్న జిల్లా అయిన అనంత‌పురంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరు నానాటికీ తీసిక‌ట్టుగా ఉందా?  సీఎం చంద్ర‌బాబు స‌ర్వేలో స‌ద‌రు ఎమ్మెల్యేల ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ట్టు తేలిందా?  దీంతో ఇక‌, వారిని ఉపేక్షించేది లేద‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. అనంత‌పురం జిల్లాలో గ‌త ఎన్నికల్లో మొత్తం 14 సీట్ల‌కు టీడీపీ 12 సీట్లు గెలుచుకుంది. ఆ త‌ర్వాత క‌దిరి ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోవ‌డంతో ఇప్పుడు జిల్లాలో వైసీపీకి ఒక్క ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ఒక్క‌రు మాత్ర‌మే ఉన్నారు. ఇక్క‌డ పార్టీ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత చాలా బ‌లోపేతం అవుతుంద‌ని బాబు ఆశ‌లు పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీకి భారీ ఎత్తున అభిమానులు పెరుగుతార‌ని, అస‌లు విప‌క్షం జెండా ప‌ట్టుకునే వారు న‌డిపించేవారు కూడా ఉండ‌ర‌ని అధినేత చంద్ర‌బాబు భావించారు. 

అయితే, అనూహ్యంగా ఆయ‌న అనుకున్న‌ది ఒక్క‌టి, జ‌రుగుతోంది మ‌రొక‌టి అన్న‌విధంగా ఉంద‌ట క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి. ఇటీవ‌ల ఇక్క‌డ విప‌క్ష నేత, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే, టీడీపీకి పెట్ట‌ని కోటగా మారిన ఈ జిల్లాలో విప‌క్ష నేత‌ను ప‌ట్టించుకునే వారు ఎవ‌రుంటారు? అని బాబు భావించారు. కానీ, బాబు అనుకున్నట్టుగా అక్క‌డ జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఎక్క‌డ మీటింగ్ పెడితే అక్క‌డ ప్ర‌జ‌లు ఎగ‌బ‌డ్డారు. దీంతో బాబు.. అక్క‌డ క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రిస్థితి, ఎమ్మెల్యే ప‌నితీరుపై 24 గంట‌ల్లోనే ఇంటిలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్నారని తెలిసింది. ఈ నివేదిక‌లో.. బాబుకు న‌మ్మ‌లేని నిజాలు వెల్ల‌డ‌య్యాయ‌ట‌.

జ‌గ‌న్ ప‌ర్య‌టించిన 5 నియోజ‌క‌వ‌ర్గాలు.. గుంత‌క‌ల్లు, క‌ళ్యాణ‌దుర్గం, మడ‌క‌సిర‌, ధ‌ర్మ‌వ‌రం, పెనుగొండ‌ల‌లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింద‌ట‌. అంతేకాదు, వీటికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యేలు.. జితేంద‌ర్ గౌడ్‌, హ‌నుమంత‌రాయ చౌద‌రి, ఈర‌న్న‌, సూర్య‌నారాయ‌ణ‌, పార్థ‌సార‌థిలు త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా ఇంటిలిజెన్స్ ప‌క్కా ఆధారాల‌తో స‌మాచారం సేక‌రించి బాబుకు అందించింద‌ని తెలుస్తోంది. గ‌తంలోనూ చంద్ర‌బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వే చేయించిన‌ప్పుడు వీరి ప‌ని తీరుబాగోలేద‌ని స్ప‌ష్టం కావ‌డంతో పిలిచి వార్నింగ్ ఇవ్వ‌డంతోపాటు ప‌నితీరు మెరుగు ప‌డాల‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని సూచించారు. 

అయినా కూడా వీరిలో మార్పు రాక‌పోగా.. ఎలాగూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం లేదు కాబ‌ట్టి ఇప్పుడే రాబ‌ట్టుకోవాల‌నే ధోర‌ణిలో ఉన్నార‌ని, దీంతో స్థానికంగా ప్ర‌జ‌లు ఈ ఎమ్మెల్యేల‌తో విసిగిపోతున్నార‌ని నివేదిక స్ప‌ష్టం చేసింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే విప‌క్ష నేత జ‌గ‌న్‌కు అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని కూడా ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లో అధికారులు పేర్కొన్నార‌ట‌. దీంతో ఇక‌, చంద్ర‌బాబు త‌న డైరీలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేల చుట్టూ రెడ్ మార్క్ పెట్టార‌ని ఎట్టిప‌రిస్థితిలోనూ వీరికి ఇక‌, టికెట్ ఇచ్చే ఆలోచ‌న కూడా చేయ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. ఇదీ అనంత టీడీపీ ప‌రిస్థితి. 

 

అనంత టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆ ఐదుగురు ఔట్.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share