ఏపీ బీజేపీలో ఒక‌రు ముందుకు న‌లుగురు వెన‌క్కి.. వింత పాలిటిక్స్‌!

January 20, 2018 at 11:32 am
AP, BJP, Politics, conflicts, modi

“మాకు చంద్ర‌బాబును మించిన  బ‌లం ఉంది. మాకు మేమే సాటి.. మాకు మేమే పోటీ. మాతో పెట్టుకుంటే రాష్ట్రాన్న‌యి నా క‌ట్ చేస్తాం.“ – ఇవీ ఇటీవ‌ల కాలంలో ఏపీ బీజేపీలో నేత‌ల వ్యాఖ్య‌లు. సోము వీర్రాజు, పురందేవ్వ‌రి, కావూరి సాంబ‌శివ‌రావు, మంత్రి మాణిక్యాల‌రావు వంటి వారు బీజేపీ బ‌లాన్ని భారీ ఎత్తున మాట‌ల్లో చూపిస్తున్నారు. చంద్ర‌బాబు పార్టీ టీడీపీలో అన‌వస‌రంగా పొత్తుకు సిద్ధ‌మై అధిష్టానం త‌ప్పుచేసింద‌ని కామెంట్లు కుమ్మ‌రించిన వారు కూడా ఉన్నారు. వ‌చ్చే ద‌ఫా ఒంట‌రి పోరుకు సిద్ధ‌మై.. పార్టీని  బ‌లోపేతం చేసుకుని నిల‌బ‌డ్డ అన్ని స్థానాల్లోనూ నిస్సంకోచంగా గెలిచి తీర‌తాం అని కుండ బ‌ద్ద‌లు కొట్టి.. చెప్పిన వారూ ఉన్నారు. ఇక‌, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏకంగా.. బాబుతో పొత్తు చారిత్ర‌క త‌ప్పిదం అనేశారు.  

అలా అన్నాక ఏమైందో ఏమో.. మీడియా కంట ప‌డ‌కుండా కాలం వెళ్ల‌దీస్తున్నారు. అయితే, స్థానిక నేత‌లు ఇలా చెబుతుంటే.. ఏపీకే చెందిన బీజేపీ సీనియ‌ర్లు, ప‌ద‌వులు అనుభ‌వించిన వారు మాత్రం మ‌రోర‌కంగా మాట‌లు వ‌ల్లె వేస్తున్నారు. గ‌తంలో విజ‌య‌వాడ తూర్పు నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సినీ న‌టుడు కోట శ్రీనివాస‌రావు.. ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఐసీయూలో ఉన్న‌ట్టుగా ఉంద‌ని చెప్పి తీవ్ర సంచ‌ల‌నం సృష్టించారు. అంతేకాదు, బాబుతో పొత్తు పెట్టుకోక‌పోయి ఉంటే .. బీజేపీ జెండా మోసేవారు కూడా ఏపీలో క‌రువ‌య్యేవార‌ని పోస్ట్ మార్ట‌మ్ మ‌హా స్పీడ్‌గా చేసేశారు. ఇక‌, ఇప్పుడు ఇదే బాట‌లో న‌డిచారు మాజీ ఎంపీ, బీజేపీ సీనియ‌ర్ నేత‌, న‌టుడు కృష్ణం రాజు. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేద‌ని సింపుల్‌గా ఆయ‌న తేల్చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. 

నిజానికి కృష్ణం రాజు బీజేపీలో చాలా సీనియ‌ర్‌. గ‌త యూపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న అక్క‌డ ప్ర‌చారం కూడా చేసి వ‌చ్చారు. ఖ‌ర‌గ్‌పూర్‌లో దాదాపు ప‌ది రోజుల పాటు మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేసిన కృష్ణంరాజుకు పార్టీలోని పెద్దల ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయి. అలాంటి ఆయ‌న ఏపీలోని బీజేపీ గురించి మాట్లాడుతూ.. “ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అంత బలం లేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు కూడా పరిస్థితిలో మార్పు రావొచ్చు. పార్లమెంటు సీట్లు మాత్రం భాజపా గెల్చుకుంటోంది. స్థానిక ఓట్లను మాత్రం ముఖ్యమంత్రి ఎవరు, వాళ్ల పనితీరు ఏంటన్నది ప్రభావితం చేస్తుంటుంది“ అని చెప్ప‌డం  స్థానిక బీజేపీ నేత‌ల్లో గంద‌ర‌గోళాన్ని సృష్టించింది.  

బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని తాము ఎంతో కృషి చేస్తుంటే వీరి వ్యాఖ్య‌లు ఇలా ఉంటే ఎలా? అంటూ సోము వీర్రాజు ఇప్ప‌టికే త‌న అనుచ‌రుల వ‌ద్ద వాపోయారు. “మేం క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్నాం. పార్టీని నాశ‌నం చేయాల‌నుకుంటున్న వారిపై కామెంట్లు చేస్తున్నాం. పార్టీ అభివృద్ధికి ఏం చేయాలో అది చేస్తున్నాం. అలా కాకుండా పార్టీ కోసం మీరు కూడా ఏదైనా ఉంటే చెప్పండి. పార్టీని డెవ‌ల‌ప్ చేయండి ఎద‌గ‌దు.. ఇంతే అని చెప్ప‌డం ద్వారా ప‌ని చేస్తున్న వారిని కూడా నిర‌స‌ప‌డేలా కామెంట్లు ఎందుకు చేస్తున్నారు?“ అని సోము అన్న‌ట్టు బీజేపీలో చ‌ర్చ న‌డుస్తోంది. మొత్తానికి ఏపీ బీజేపీలో ఒక‌రు ముందుకు న‌లుగురు వెన‌క్కి.. అన్న‌చందంగా ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈప‌రిస్థితి ఎప్ప‌టికి మారుతుందో చూడాలి. 

 

ఏపీ బీజేపీలో ఒక‌రు ముందుకు న‌లుగురు వెన‌క్కి.. వింత పాలిటిక్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share