డిసెంబ‌ర్‌11..ఏపీ పాలిటిక్స్ లో అసలు సినిమా!

November 8, 2018 at 3:11 pm
AP Politics, Crucial Day, in December, five states Elections Result

డిసెంబ‌ర్ 11.. ఈ తేదీన దేశంలో జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే రోజు. తెలంగాణ‌తోపాటు రాజస్థాన్‌, మిజోరం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌నున్నాయి. అయితే.. తెలంగాణ ఫ‌లితాలు మాత్రం ఏపీ రాజ‌కీయాల‌ను తీవ్ర స్థాయిలో ప్ర‌భావితం చేయ‌నున్నాయి. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డి.. అధికార టీఆర్ఎస్‌ను ఢీకొన‌బోతున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌హాకూట‌మి అడుగులు వేస్తోంది. అయితే.. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. ఎన్నివిమ‌ర్శ‌లు వ‌చ్చినా.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి కాంగ్రెస్‌తో క‌లిసి న‌డుస్తున్నారు. ఇక్క‌డ కేసీఆర్‌, ఢిల్లీలో మోడీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న క‌దులుతున్నారు.

party

తెలంగాణ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే.. మాత్రం ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌ని ఊహించ‌డానికి కూడా లేదు. మ‌హాకూట‌మి, టీఆర్ఎస్ మ‌ధ్య ఢీ అంటే ఢీ అనే వాతావ‌ర‌ణం ఉంది. ఈ నేప‌థ్యంలో ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న దానిపై ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. ఇక్క‌డి ఫ‌లితాలు ఏపీ రాజ‌కీయాల్ని కుదిపేస్తాయని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఒక‌వేళ‌.. తెలంగాణ‌లో మ‌హాకూట‌మి అధికారంలోకి రాకుంటే మాత్రం ఏపీలో టీడీపీ మూట‌ముల్లె స‌ర్దుకోవాల్సిందేన‌ని, ఇక అక్క‌డ ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ‌ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీని విభ‌జించింద‌న్న కోపంతో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను చిత్తు చేశారు ప్ర‌జ‌లు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. ఫ‌లితాల్లో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. అది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి క‌లిసివ‌స్తుంద‌ని అంటున్నారు.

అంతేగాకుండా.. రాహుల్ భేటీ అయిన త‌ర్వాత చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దేశంలో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నింటికీ ఏకం చేస్తామ‌ని, అంద‌రూ క‌లిసి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. బీజేపీ వ్య‌తిరేక కూట‌మిని ఏర్పాటు చేసి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ గ‌ద్దె దింపుతామ‌ని కూడా ఆయ‌న అంటున్నారు. తెలంగాణ‌లో మ‌హాకూట‌మికి ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తే.. జాతీయ స్థాయిలో చంద్ర‌బాబుకు పెద్ద దెబ్బేన‌ని, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల చుట్టూ తిరిగే నేత‌గా మిగిలిపోతార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు చేతులు క‌లడాన్ని ఏపీలో సొంత పార్టీ నేత‌లు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తే.. పార్ల‌మెంట్‌, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. చూద్దాం మ‌రి ఏం జ‌ర‌గుతుందో..!

డిసెంబ‌ర్‌11..ఏపీ పాలిటిక్స్ లో అసలు సినిమా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share