అక్కడ ఒక్కసారి ఓడితే..అంతే మళ్లీ ఛాన్స్ ఉండదు!

July 13, 2018 at 3:58 pm
AP, Politics, Payakurao peta, constituency, TDP, YSRCP

సాధారణంగా కొన్ని సెంటిమెంట్స్ కొందరిని వదలవు..అది మనుషులకే కావొచ్చు..వస్తువులే కావొచ్చు..ప్రదేశాలే కావొచ్చు. ఇప్పుడు ఏపిలో ఓ నియోజక వర్గం పరిస్తితి ఇలాగే ఉంది. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఒకసారి ఓటమి పాలైన వారు మళ్లీ ఇదే నియోజకవర్గంలో గెలిచిన సందర్భాలు ఇప్పటి వరకూ లేవనే చెప్పాలి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటా అనుకుంటున్నారా..! విశాఖలోని జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన పాయకరావుపేట. దాదాపు 50 ఏళ్ల నుంచీ ఇదే సెంటిమెంట్‌ కొనసాగుతూ వస్తోంది.

1967లో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి గంట్లాన సూర్యనారాయణపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బి.నాగభూషణం కేవలం 1,639 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ 1972లో గంట్లానపై రెండోసారి పోటీ చేశారు. అప్పుడు 18,252 ఓట్ల తేడాతో ఓటమి పాలై డిపాజిట్‌ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1983లో టీడీపీ అభ్యర్థినిగా గంటెల సుమన, కాంగ్రెస్‌ అభ్యర్థి నెలపర్తి రామారావుపై 23,778 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత 1989, 1994, 1999, 2004, 2012లో ఇదే నియోజకవర్గం నుంచి గంటెల సుమన పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

ఆ నియోజకవర్గంలో స్థానికుడైన కాకర నూకరాజు 1985, 1989, 1994లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన హ్యాట్రిక్‌ రికార్డును గానీ, మెజార్టీని గానీ ఎవరూ అధిగమించకపోవడం విశేషం. 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షకుమార్‌పై కాకర 29,768 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటివరకూ నియోజకవర్గంలో ఇదే అత్యధిక మెజార్టీ. తర్వాత బ్యాడ్ లక్ మొదలైంది..సెంట్ మెంట్ దెబ్బతీసింది..1999లో తెలుగుదేశం పార్టీ తరఫున కాకరబరిలో నిలిచినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

1999, 2004లో రెండుసార్లు టీడీపీ నుంచి చెంగల వెంకట్రావ్‌ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2009, 2014 సార్వత్రిక ఎన్నికలు, 2012 ఉపఎన్నికల్లో చెంగల పోటీ ఓటమిపాలయ్యారు. ముచ్చటగా మూడోసారి గెలిచి కాకర రికార్డును బ్రేక్‌ చేద్దామనుకున్న చెంగల సాధించలేకపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికలు, 2012 ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌, వైసీపీ తరఫున గొల్ల బాబూరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తర్వాత 2014లో ఆయన పాయకరావుపేట నుంచి కాకుండా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో టీడీపీ అభ్యర్థి కాకర నూకరాజు చేతిలో ఓడిపోయిన అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవీ హర్షకుమార్‌ అమలాపురం ఎంపీగా గెలుపొందారు. దీన్నిబట్టి పాయకరావుపేట నియోజకవర్గంలో ఒకసారి ఓటమి పాలైన వారు ఇప్పటి వరకూ రెండోసారి గెలవలేదని చరిత్ర చెబుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ఈ సెంటిమెంట్‌ బ్రేక్‌ అవుతుందా ? లేక కొనసాగుతుందా? అనేది చూడాల్సిందే.

అక్కడ ఒక్కసారి ఓడితే..అంతే మళ్లీ ఛాన్స్ ఉండదు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share