ప్ర‌త్యేక హోదా.. ఇప్పుడు బాబు చేతిలోనే!

July 4, 2018 at 4:02 pm
AP special status, in chandra babu hands, Politics

అవును! నిన్న మొన్న‌టి వ‌రకు కేంద్రం చేతిలో ఉన్న ప్ర‌త్యేక హోదా అంశం.. ఇప్పుడు త‌లుచుకుంటే బాబు చేతిలోకే రానుంది. ఏపీ విభ‌జ‌న పాపంతో కాంగ్రెస్ మ‌ట్టికొట్టుకుపోగా.. విభ‌జ‌న తాలూకు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌ని పాపం బీజేపీకి చుట్టుకుంటోంద‌ని ప‌దే ప‌దే ప్ర‌తి వేదిక‌పైనా విమ‌ర్శిస్తున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు అనుకోని విధంగా కాలం క‌లిసి వ‌చ్చింది. ఏపీ త‌ర‌ఫున గ‌ళం విప్పేందుకు, బాధ చెప్పేందుకు, సాంత్వ‌న పొందేందుకు కూడా ఆయ‌న‌కు అవ‌కాశం వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు క‌నుక ఆయ‌న స్పందించ‌క‌పోతే.. ఏపీ ప్ర‌యోజ‌నాలు మ‌ట్టిలో క‌ల‌వడం త‌థ్యం. అదేస‌మ‌యంలో ఏపీలో టీడీపీపైనా.. బాబు వ్య‌వ‌హార శైలిపైనా కూడా అనుమానాలు పెను భూతాలు కావ‌డం త‌థ్యం అంటున్నారు విశ్లేష‌కులు.

విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని.. పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించా లంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి గ‌తంలో పిటిష‌న్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిష‌న్‌పై స్పష్టతనివ్వాలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అధికారికంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ఊసెత్తక పోవడం గమనార్హం.

దీనిపై సుప్రీంలో కేంద్రం చెప్పాల్సింది చెప్పేసింది. దీంతో ఇప్పుడు ఏపీ వంతు వ‌చ్చిన‌ట్ట‌యింది. నిజానికి సుప్రీం కోర్టులో ఈ పిటిష‌న్ వేసింది.. ఏపీకి చెందిన నాయ‌కుడు కాదు. అయిన‌ప్ప‌టికీ.. ఏపీ విష‌యంలో కేంద్రం స్ప‌ష్టత ఇచ్చేసింది. తాము ఇవ్వాల్సింది ఏమీ లేద‌ని చెప్పుకొచ్చింది. ఈ స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు మౌనంగా ఉంటే అది ఆయ‌న‌కే ప్ర‌మాదంగా మారిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇన్నాళ్లు ఆయ‌న కేంద్రం ఏపీకి ఏమీ ఇవ్వ‌లేద‌ని చెప్పుకొస్తున్నారు. రూపాయి ల‌బ్ధి కూడా రాలేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో అంతా ఇచ్చామ‌ని చెబుతున్న కేంద్రం వాద‌న‌ల‌పై న్యాయ పోరు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

దీంతో ఈ పిటిష‌న్‌లో ఏపీ ప్ర‌భుత్వం ఇంప్లీడ్ అయి.. వాస్త‌వాల‌ను కోర్టుకు నివేదించ‌డం ద్వారా ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుత‌న్నారు. అలా కాకుండా చంద్ర‌బాబు కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తుంటే మాత్రం ఇప్పుడు జ‌రిగిన ఈ వ్య‌వ‌హారంతో అది కూడా తేలిపోతుంద‌ని చెబుత‌న్నారు. మొత్తంగా ఇప్పుడు ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల ఉచ్చు బాబు మెడ‌కు చుట్టుకుంది. మ‌రి మౌనంగా ఉంటారో.. న్యాయ‌పోరాటానికి దిగుతారో చూడాలి.

ప్ర‌త్యేక హోదా.. ఇప్పుడు బాబు చేతిలోనే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share