పశ్చిమ గోదావరిలో జేసీ ఫార్ములా బెడిసికొట్టిందిగా

జేసీ ఫార్ములా!  ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉన్న ఫార్ములా!  అనంత‌పురం ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేయించుకోవడం కోసం తెర‌మీద‌కి తెచ్చిన ఫార్ములా ఇది. త‌న మ‌న‌సు చెబుతోంద‌ని అంటూ ఆయ‌న త‌న సీటుకు రాజీనామా చేసేందుకు రెడీ అయిన ఉదంతం! దీంతో అధిష్టానం దిగివ‌చ్చి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని చాగ‌ల్లుకు నీళ్లు అందించింది. ఇక‌, ఇప్పుడు త‌మ త‌మ ప‌నులు సాధించుకోవ‌డం కోసం పలువురు నేత‌లు ఈ ఫార్ములానే ఫాలో అయిపోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం వీళ్ల తోక క‌ట్ చేస్తున్నార‌ని స‌మాచారం. 

తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింతలపూడి మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి హాట్ టాపిక్‌గా మారింది. ఈ  పదవి కోసం ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి పీతల సుజాత వర్గీయులు రోడ్డెక్కారు. మంత్రులు పితాని సత్యనారాయణ, పత్తిపాటి పుల్లారావులు ఎంత చెప్పినా విన్పించుకోలేదు. రెండు వర్గాలూ కూర్చుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పినా ఎవరికి వారే భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే మాగంటి వర్గీయులు రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. 

మాగంటి బాబు వర్గానికి చెందిన 17 మంది ఎంపీటీసీలు, ఇద్దరు జడ్పీటీసీలు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను జిల్లా పరిషత్ సీఈవోకు అప్పగించారు. అయితే వీరి బెదిరింపులకు బాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రతి వాళ్లూ రాజీనామా చేస్తామని హెచ్చరిస్తే డిమాండ్లకు తలొగ్గుతామా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాంటి డ్రామాలకు తాము తలొగ్గేది లేదని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మాగంటి వర్గీయులకు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. సో.. మొత్తంగా ఇటు పీత‌ల వ‌ర్గానికి, అటు మాగంటి వ‌ర్గానికి కూడా టీడీపీ అధిష్టానం బాగానే షాక్ ఇచ్చింద‌ని స‌మాచారం.