
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయం తెలుగు సినీ పరిశ్రమకు బాధ్యత లేదా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేం ద్ర ప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై టాలీవుడ్ మాట ఎలా ఉన్నా.. రాజకీయ విశ్లేషకుల నుంచి, సినీ రంగంలోని సీనియ ర్ల నుంచి కూడా ఒకింత రివర్స్ కామెంట్లే వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చి చంద్రబాబు దాదాపు నాలుగేళ్లు పూర్తయింది. ఏపీ సమస్యలు ఆయన సీఎంగా సంతకం చేసిన నాటి నుంచి ఉన్నాయి.
మరి అప్పటి నుంచి ఆయన ఏం చేసినట్టు. ఇప్పుడు టాలీవుడ్ స్పందించదా? అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్..అడుగుతున్న ప్రశ్న.. నాలుగేళ్లుగా చంద్ర బాబు ఏపీ విషయంలో ఏదైనా క్లారిటీతో ఉంటే కదా? ఏదైనా చేయడానికి?! కానీ, ఆయనకు ఏనాడూ క్లారిటీ లేదు. ఎన్నికల సమయంలో హోదా ముద్దు అన్నారు. హోదా ఐదేళ్లు కాదు కనీసం పదేళ్లు ఉండాలన్నారు. మరి ఇంతలోనే ఏ చీమ కుట్టిందో.. మాట మార్చారు. హోదా వద్దు ప్యాకేజీ అన్నారు. ఇలా నాలుగేళ్లుగా ఆయన ఏపీ సమస్యలపై అవలంబించిన విధానం అందరినీ విస్మయానికి గురి చేసింది.
ఇంత గందరగోళం మధ్య ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జరిగిన ఆందోళనకు టాలీవుడ్ నుంచి సీనియర్లు, మెగా స్టార్లు ముందుకు రాకపోయినా.. సంపూర్ణేష్ బాబు, శివాజీ వంటి వారు ఎప్పుడూ ముందున్నారు. మరి వారి విషయం ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదా?! మరి ఇప్పుడు మొత్తం ఫైట్ చంద్రబాబు కేంద్రంగా మారిపోయే సరికి.. ప్రత్యేక హోదా సాధించడం కష్టం కావడం సహా.. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టే సరికి.. ఇప్పుడు బాబుకు టాలీవుడ్ గుర్తుకొచ్చింది.
నిజానికి టాలీవుడ్లో అగ్రహీరోగా ఉన్న నందమూరి బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బావ కావడం గమనార్హం. ఇక, దగ్గుబాటి రామానాయుడు అండ్ ఫ్యామిలీ మొత్తం బాబుకు అనుకూలమే. ఇక, జూనియర్ ఎన్టీఆర్ కూడా పిలిస్తే.. పలికే వ్యక్తే..! దర్శక దిగ్గజం రాజమౌళి కూడా చంద్రబాబు ఏది కోరితే అది చేసి పెట్టే టైపే. ఇక, రాఘవేంద్రరావు ఏకంగా వారానికి నాలుగు రోజులు సీఎం పేషీలోనే గడుపుతున్నారు. మరి ఇంతగా టాలీవుడ్‌తో సంబంధాలు పెనవేసుకున్న వారు.. హీరోలను రంగంలోకి దింపుకొచ్చుగా? అనేదీ వినిపిస్తోంది. అయితే, చంద్రబాబుకే క్లారిటీ లేనప్పుడు తాము ఏం చేసి ప్రయోజనం ఏంటనేది టాలీవుడ్ వ్యాఖ్య.
నిన్న మొన్నటి వరకు అసలు చంద్రబాబుకే ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక ప్యాకేజీ’ కావాలా?. ప్రత్యేక హోదా కావాలా? అనే విషయంపైనే క్లారిటీ లేదు. ఈ నాలుగేళ్ళలో ఆయన మార్చినన్ని మాటలు బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మార్చి ఉండడు. చంద్రబాబుకు అన్నింటి కంటే ‘ప్రత్యేక హోదా’నే కీలకం అని తేలి కేవలం పది రోజులు కూడా కావటం లేదు.
40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీనే ఇంత గందరగోళంలో ఉంటే…అసలు రాజకీ యాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ముందుకు సాగే టాలీవుడ్ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తాలా? అనే కామెంట్లు భారీగా వినిపిస్తున్నాయి. మరి వీటికి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎలా ఆన్సరిస్తారో చూడాలి. మొత్తంగా రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి వాతావరణం దృష్టి మరల్చేందుకే టీడీపీ ఇలా వ్యూహం సిద్ధం చేసిందని అంటున్నారు పరిశీలకులు.