‘తొడ’ రాజ‌కీయాలు ఇంకెన్నాళ్లు బాల‌య్యా..?!

April 21, 2018 at 3:40 pm
Balakrishna, AP special Status, Deeksha, speech

వివాదానికి కేరాఫ్‌.. నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినీరంగంలో ఉన్నత స్థాయికి వెళ్లినా.. చెప్పుకోద‌గ్గ చ‌రిత్ర‌ను సొంతం చేసుకో లేక పోయిన బాల‌య్య‌.. త‌ర‌చుగా వివాదాల‌తో మాత్రం మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నారు. అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బాల‌య్య నిన్న జ‌రిగిన చంద్ర‌బాబు ధ‌ర్మ పోరాట దీక్ష‌లో ప్ర‌ముఖంగా క‌నిపించారు. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో మాట‌ల దాడి చేశారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హారం పైనా ప‌రోక్షంగా మాట‌ల దాడి చేశారు. అంతేకాదు.. తెలుగు వారి పౌరుషం ఢిల్లీ వ‌ర‌కు వినిపించాల‌ని డైలాగుల మీద డైలాగులు పేల్చుతూ.. మ‌ధ్య‌లో హిందీలోనూ దంచికొట్టారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య త‌న దైన శైలిలో తొడ‌కొట్టి.. మోడీపై మ‌నం యుద్ధం చేస్తున్నాం.. తెలుగు వారి పౌరుషం చూపిద్దాం! అంటూ వ్యాఖ్యానించాడు. 

 

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. బాల‌య్య తొడ కొట్టే రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఓ నెల రోజుల కింద ఏపీ టీడీపీ నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఇద్ద‌రు తమ ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించిన స‌మ‌యంలో ఇదే బాల‌య్య మీడియా అడిగిన హోదా ప్ర‌శ్న‌కు త‌డ‌బ‌డ్డారు. హోదాతో ఏపీకి వ‌చ్చే ప్ర‌యోజ‌నాలేమిటో చెప్పాలంటూ మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. అయితే, దీనికి బాల‌య్య చెప్పిన స‌మాధానం. “హోదాతో ఎంతో వ‌స్తుంది. హోదా అంటే.. నిజానికి అవ‌న్నీ సీఎం గారికే ఎక్కువ తెలుసు“ అని త‌న‌దైన శైలిలో.. “మ‌రి.. నాన్న‌గారి హ‌యాంలో కేంద్రాన్ని మెడ‌లు వంచి ఏపీకి సాయం చేయించుకున్నారు“- అంటూ పాత‌పాట‌నే పాడారు. మ‌రి ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో క్లారిటీ లేని బాల‌య్య ఇలా.. తొడ కొట్టే రాజ‌కీయాలు ఎందుకు? అని అంటున్నారు నెటిజ‌న్లు.

 

తన నియోజ‌క‌వ‌ర్గం హిందూపురంలో విజిటింగ్ ఎమ్మెల్యేగా పేరుపొందిన బాల‌య్య‌.. అప్పుడప్పుడు చేసే ప‌ర్య‌ట‌న‌లు సైతం వివాదాస్ప‌ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రైనా అభిమానులు త‌న‌కు ఎదురు నిల‌బ‌డినా, త‌న ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డినా.. కూడా బాల‌య్య‌లోఅస‌హ‌నం క‌ట్ట‌లు తెగుతుంది. మ‌రి అలాంటి అస‌హ‌న రాజ‌కీయాలు చేసే బాల‌య్య ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాత్రం ఇలా తొడ‌కొట్ట‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా బాల‌య్య గతంలోనూ ప‌లు సంద‌ర్భాల్లో తొడ‌కొట్టి రాజ‌కీయాలు చేశారు. 

 

నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అభిమానుల ఉత్సాహంతో ఊగిపోయిన బాల‌య్య తొడ‌కొట్టి.. స‌వాల్ విసిరారు. అయితే, ఇప్పుడు తొడ‌కొట్ట‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజనం? అంటున్నారు నెటిజ‌న్లు. జ‌ర‌గాల్సిన న‌ష్టం మీ వియ్యంకుడి ఉదాశీన వైఖ‌రితో జ‌రిగిపోయింద‌ని, ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌లేని నాయ‌కుడిగా మీరు ఎన్నిసార్లు తొడ‌గొట్టినా ప్ర‌యోజ‌నం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి బాల‌య్య వీరిపైనా అస‌హ‌నం ప్ర‌ద‌ర్శిస్తారో ఏమో చూడాలి. 

 

‘తొడ’ రాజ‌కీయాలు ఇంకెన్నాళ్లు బాల‌య్యా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share