బాల‌య్య‌కు ‘నాన్ లోక‌ల్’ సెగ ఖాయ‌మేనా..?

January 20, 2018 at 10:37 am
Balakrishna, MLA, TDP, Hindupur, politics

నంద‌మూరి కుటుంబానికి చెక్కుచెద‌ర‌ని విజ‌యం అందిస్తూ వ‌చ్చిన అనంత‌పురం జిల్లా హిందూపురంలో ప్ర‌జ‌లు ఇప్పుడు త‌మ మ‌న‌సు మార్చుకున్నార‌ని స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు చెబుతున్నారు. నంద‌మూరి వంశానికి స్థానికంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. కానీ, ఎన్టీఆర్ యాదృచ్ఛికంగా త‌న హ‌యాంలో హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచిన నేప‌థ్యంలో సెంటిమెంట్‌గా తీసుకుని 2014లో ఆయ‌న కుమారుడు బాల‌కృష్ణ అక్క‌డి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్ర‌జా ప్ర‌తినిధి అంటే.. ఒక‌ప్ప‌డు ఏమోకానీ, ఇప్పుడు మాత్రం సోష‌ల్ మీడియా ప్ర‌భావమో లేదా ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న చైత‌న్య‌మో తెలియ‌దు కానీ.. ఏదైనా స‌మ‌స్య చెప్పుకొనేందుకు త‌లుపు త‌ట్ట‌గానే క‌నిపించేలా ఉండాల‌ని కోరుకుంటున్నారు. త‌మ‌కు అందుబాటులో ఉండాల‌ని కూడా ప్ర‌జ‌లు భావిస్తున్నారు. 

కానీ, హిందూపురం నుంచి గెలిచిన బాల‌య్య‌.. అక్క‌డ ఓ భ‌వ‌నంలో కార్యాల‌యం ఏర్పాటుచేసినా.. తాను మాత్రం రెండు మూడు నెల‌ల వ‌ర‌కు అక్క‌డ‌కు వెళ్ల‌డం లేదు. కేవలం షూటింగుల్లో వ‌స్తున్న గ్యాప్ స‌మ‌యంలోనే ఆయ‌న హిందూపురంలో ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో అక్కడ భ‌వ‌నంలో ఉండే ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ శేఖ‌ర్ నాయుడే నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యేతో స‌మానమ‌నే ప్ర‌చారం ఉంది. దీంతో వారు ఎమ్మెల్యే బాల‌య్యకు ఏం చెప్పాల‌న్నా నేరుగా స‌ద‌రు నాయుడుకే చెప్పుకొవాల్సి వ‌చ్చింది. ఫించ‌న్లు, ప‌క్కా ఇళ్లు, రేష‌న్ కార్డులు వంటి విష‌యంలో వారు తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. గ‌త ఏడాది .. ఇలా ఏర్పాటు చేసిన పీఏ నాయుడే ప్ర‌జ‌ల నుంచి లంచాలు డిమాండ్ చేయ‌డం, చివ‌రికి ప్ర‌జ‌ల‌ను బెదిరించ‌డం వ‌ర‌కు కూడా వెళ్లింది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చ‌డం చివ‌రికి రంగంలోకి దిగిన బాల‌య్య స‌ద‌రు నాయుడును తొల‌గించ‌డం కూడా జ‌రిగింది. 

అయితే ఇప్ప‌టికీ బాల‌య్య‌.. హిందూపురంలో అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని, పండ‌గ‌కో.. ప‌బ్బానికో కొత్త అల్లుడు వ‌చ్చిన‌ట్టు వ‌చ్చి వెళ్తున్నారని స్థానికులు ఇటీవ‌ల కాలంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త‌గా అప్పాయింట్ అయిన బాల‌య్య పీఏ కృష్ణ‌మూర్తికి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవాలా?  ఎమ్మెల్యే ఎవ‌రు అని కూడా మ‌హిళ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.  బాల‌య్య ఎప్ప‌డో  వ‌చ్చిన‌ప్పుడు ఏదో ఆర్భాటంగా ప్రారంభోత్స‌వాలు అంటూ హ‌డావుడి సృష్టించి మీడియా మీటింగులు పెట్టి.. షూటింగుల‌కు వెళ్తున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ క్ర‌మంలో టీడీపీలోనే మ‌రో వ‌ర్గం.. బాల‌య్య పేరు చెప్ప‌కుండా మ‌న‌కు స్థానికంగా ఉండే నేత అవ‌స‌రం అంటూ ఇటీవ‌ల కొత్త డిమాండ్ కు తెర‌దీసింది. 

దీనికి స్థానికుల నుంచి కూడా మ‌ద్ద‌తు ల‌భించింది.  హిందూపురం నుంచి స్థానికేతరులు పోటీ చేస్తే పండుగకు కొత్త అల్లుళ్లు వచ్చినట్లు చుట్టపుచూపుగా రావడం మినహా నియోజకవర్గాన్ని పట్టించుకోరని అభిప్రాయానికి ‘పురం’ వాసులు వచ్చారు. గతంతో పోలిస్తే ప్రజల్లో కూడా చైతన్యం పెరగడంతో స్థానికేతరులు ఎవరు పోటీ చేసినా ఇబ్బందులు తప్పకపోవచ్చ‌ని ఇంటిలిజెన్స్ కూడా త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది. మ‌రి.. బాల‌య్య‌కు సెగ‌గా మారిన ఈ నాన్‌లోక‌ల్ విష‌యాన్ని బాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి. 

 

బాల‌య్య‌కు ‘నాన్ లోక‌ల్’ సెగ ఖాయ‌మేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts