బీజేపీ చేతికి చంద్ర‌బాబు ఇలా చిక్కారా..!

July 13, 2018 at 9:28 am
BJP, Chandra babu, Polavaram Project, nitin gadkari, Polavaram Visit

ఏపీకి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టి ఆడిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. చివ‌ర‌కు అదే కేంద్రానికి దొరికిపోయారా? ప్రాజెక్టు పూర్త‌వ‌కుండా కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌ని, నిధుల ఇవ్వ‌కుండా అడ్డంకులు సృష్టిస్తోంద‌ని ఇన్నాళ్లూ చెబుతూ వ‌స్తున్న ఆయ‌న‌.. చిన్న లాజిక్ మిస్స‌యిపోయారా? ఇప్పుడు దీనిని పట్టుకుని కేంద్రం.. బాబుపై ఎదురుదాడికి సిద్ధ‌మ‌వుతుందా? అంటే అవుననే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్రం పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఫుల్ ఫోక‌స్ పెడితే ఎలా ఉంటుందో చంద్ర‌బాబుకు హింట్ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీ! ఈ ప్రాజెక్టును ప‌రిశీలించిన ఆయ‌న లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు.. ఇప్పుడు చంద్ర‌బాబును ఇరుకున పెట్టేశాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం కేంద్రానికి చంద్ర‌బాబు దొరికిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత చంద్ర‌బాబు, కేంద్రం మ‌ధ్య రాజ‌కీయ ప‌రిస్థితి మారిపోయిందం టున్నారు విశ్లేష‌కులు. బీజేపీతో క‌టీఫ్ అనంత‌రం కేంద్రంపై సీఎం చంద్ర‌బాబు.. కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యంగా అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు అనే అంశాలే లక్ష్యంగా కేంద్రంపై పోరాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న మొత్తం సీన్ మార్చేసింద‌ని చెబుతున్నారు. గడ్కరీ లేవనెత్తిన ప్రశ్నలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయ‌ట‌. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పెరిగితే పరిహారం పెరగాలి కానీ.. భూ విస్తీర్ణం ఎలా పెరుగుతుందని గడ్కరీ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి అధికారుల దగ్గర కూడా సరైన సమాధానం లేదు.

union-minister-for-road-transport-and-highways-709923

కేంద్రం ఏర్పాటు చేసిన‌ పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) అనుమతి లేకుండా ఏపీ సర్కారు ఇష్టానుసారం వెళుతోంది. కేంద్రం ఫోకస్ పెడితే పోలవరంలో ప్రభుత్వం పలు అంశాల్లో చిక్కుల్లో పడటం ఖాయం అని సాగునీటి శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం మాట్లాడిన గడ్కరీ.. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పాత డీపీఆర్‌కు ప్రస్తుత డీపీఆర్‌కు పోలికే లేదని, ఎందుకు అంత మార్పులు జ‌రిగాయో చూడాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు రూపకల్పన సమయంలోనే ఎంత భూమి సేకరించాలనే అంశాన్ని నిర్ధారిస్తారు. అంతే కానీ భూ సేకరణ చట్టాన్ని మార్చినందున ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన భూమి పెరగదు కదా? అన్న సందేహన్ని గడ్కరీ లేవనెత్తారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి అక్కడే మూడు రోజులు పాటు ఉండాలని చంద్రబాబుకు గడ్కరీ సూచించారు. జల వనరుల శాఖకు ప్రాజెక్టుపై అవసరమైన వివరాలన్నీ సమర్పించాలని కోరారు. తర్వాత ఎనిమిది రోజుల్లో అన్ని క్లియరెన్సులు ఇచ్చి నిధుల పెంపు కోసం ఆర్థిక శాఖకు ఫైల్‌ పంపుతానని స్ప‌ష్టంచేశారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. మ‌రి వీటిన్నింటినీ గ‌మ‌నిస్తే.. బాబు దొరికిపోయిన‌ట్లేన‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. మొత్తం అన్ని అంశాల‌నూ ప‌రిశీలిస్తే.. పోల‌వ‌రం లెక్క‌ల‌తో పాటు బాబు బండారం కూడా బ‌య‌ట‌పడుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

బీజేపీ చేతికి చంద్ర‌బాబు ఇలా చిక్కారా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share