ఆ కారణంతోనే సోముకు అధ్యక్ష పదవి నై..నై…

May 14, 2018 at 3:39 pm

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌గ్గాలు చేప‌ట్టారు. అయితే, ఆయ‌న‌కు ఏం చూసి ఈ ప‌ద‌వి ఇచ్చారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అదేస‌మ‌యంలో ఈ ప‌ద‌వి కోసం ఎన్నో విధాల ప్ర‌య త్నించిన బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజుకు బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో రాజ‌కీయంగా బీజేపీ నిర్ణ‌యం సెగ‌లు పుట్టిస్తోంది. ఇటు క‌న్నా.. ఇటు సోము.. ఇద్ద‌రూ  ఒకే సామాజికవర్గం వారైనప్పుడు వీర్రాజుకే పదవి ఇచ్చివుండొచ్చు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం ఎన్నడూ కులాన్ని పరిగణనలోకి తీసుకొని పదవులు ఇవ్వదని, సమర్థతను, అనుభవాన్ని చూసి పదవులు ఇస్తుందని కొందరు నేతలు వివరణ ఇస్తున్నారు.

 

సాధారణంగా బీజేపీ నాయకులకు, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నవారికి మాత్రమే కీలక పదవులు ఇస్తుంటారు. కాని మోదీ-షా పార్టీని నడిపించడం మొదలుపెట్టాక పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వలస వాదులకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. కన్నాకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఉన్న అనుభ‌మేన‌ని తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన వాద‌న. నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రి వర్గాల్లో అనేక పదవులు నిర్వహించారు. ఇదో అనుభవం. ఇక రెండోది కాంగ్రెసు రాజకీయాల గురించి ఆయనకు బాగా తెలుసు. కాంగ్రెసులో, వైసీపీలో ఆయనకు మిత్రులు, సన్నిహితులున్నారు. వారిని బీజేపీలోకి ఆకర్షించడానికి కన్నాను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ పని సోము వీర్రాజు చేయలేడని అధిష్టానం భావించింది. వీర్రాజుకు నోరెక్కువని, దీంతో వ్యవహారాన్ని సానుకూలం చేయడం కంటే, చెడగొడతాడేమోనని భయపడింది. ఆయన ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌ పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆయన వ్యతిరేకులు అధిష్టానానికి చెప్పారు. ఎన్నికల్లోగా పార్టీలో కొందరు ముఖ్య నాయకులను చేర్చుకోవాలనేది అధిష్టానం లక్ష్యం. గత నాలుగేళ్లుగా పార్టీ విస్తరించలేదు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెసు నుంచి కొందరు నేతలు వచ్చి చేరడం తప్పితే, ఆ తరువాత చేరికలు లేవు. కాబట్టి కన్నా కాంగ్రెస్ స‌హా వైసీపీల నుంచి  క‌న్నాఅయితే వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించే అవ‌కాశం ఉంటుంద‌ని అధిష్టానం భావిస్తోంది. ఈయ‌న‌కు విస్తృతంగా ఉన్న ప‌రిచ‌యాలు పార్టీకి మేలు చేస్తాయ‌ని కూడా బీజేపీ అధిష్టానం క‌న్నాపై ఆశ‌లు పెంచుకుంది. 

 

గ‌త కొన్నాళ్లుగా ఏపీలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని అమిత్ షా పిలుపునిచ్చారు. అయితే, ఈ పిలుపును స్థానిక నాయ‌కులు లైట్‌గా తీసుకున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో బీజేపీ బతికి బట్ట కట్టడం సాధ్యం కాని ప‌రిస్థితి వ‌చ్చింది.  ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయాలంటే.. స‌మ‌ర్ధుడైన నాయ‌కుడు అవ‌స‌రం. కాపు  వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని బీజేపీ నాయకులు మొదట్నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల్లోని కాపు నాయకులను ఆకర్షించాలని కాంగ్రెస్‌ నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి కన్నాకు అసైన్‌మెంటు ఇచ్చారు. ఆ వర్గాన్ని తిప్పుకునేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలనుకున్నారు. దీంతో ఆ పదవిపై కన్నా కన్నేశాడు. చివరకు అనేక కీలక పరిణామాల మధ్య ఆయన కల నెరవేరింది. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా క‌న్నాకు అంత తేలిక‌గా అయితే,  ఆప‌ద‌వి ద‌క్కింద‌ని భావించ‌డానికి వీల్లేదు. 

 

ఆ కారణంతోనే సోముకు అధ్యక్ష పదవి నై..నై…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share