వ్యాపారాల కోసమే… బాబు పంచకు…

September 12, 2018 at 3:32 pm
Chalamalasetti Suneel, YSRCP, Leaders, Jumping to TDP, business

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు, ప్రధానంగా ప్రజాప్రతినిధులను రకరకాలుగా మభ్యపెట్టి.. తెలుగుదేశంలో చేర్చుకోడానికి చంద్రబాబునాయుడు నిత్యం ఉత్సాహపడుతూ ఉంటారనే సంగతి అందరికీ తెలుసు! ఎప్పటికప్పు కొత్త నాయకులకు ఆయన ఎర వేస్తూనే ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నారు గనుక.. ఎర వేయడం కూడా ఆయనకు సునాయాసమైన సంగతి. తాజాగా ఆ కోవలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ లోక్ సభ స్థానానికి ఇన్‌ఛార్జిగా ఉన్న చలమలశెట్టి సునీల్ కూడా చేరుతున్నారు. ఆయన వైకాపాను వీడి త్వరలోనే తెదేపా తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది.

చలమలశెట్టి సునీల్ కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తమ పూర్వీకుల తాలూకు మూలాలకు గోదావరి జిల్లాతో సంబంధం ఉన్నదని చెప్పుకుంటూ మొత్తానికి కాకినాడ లోక్ సభ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికి రెండు సార్లు ఆ నియోజకవర్గం నుంచి పోటీచేశారు గానీ, ఒక్కసారి కూడా నెగ్గలేదు. గతంలో ఓసారి ప్రజారాజ్యం తరఫున, మరోమారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన చరిత్ర ఆయనకు ఉంది.

news9272

అలాంటి చలమలశెట్టి సునీల్ ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతున్నారు. ఆయన తెదేపాలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది. చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో వైకాపాలోని కాపు నాయకులపై కాస్త ఫోకస్ పెంచారని సమాచారం. అక్కడున్న కాపు నాయకులని ఫిరాయింపజేసుకుంటే గనుక.. కాపుల్లో జగన్ మీద నమ్మకం సడలిపోతున్నదని ప్రచారం చేయడానికి వీలవుతుందనేది చంద్రబాబు వ్యూహం. దానికి తోడు.. చలమలశెట్టి సునీల్ కు తెలుగుదేశం నాయకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. విద్యుదుత్పత్తి రంగంలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ ఉంది. వీటన్నిటినీ పురస్కరించుకుని.. ఆయన కాకినాడ ఎంపీసీటుకు వైకాపా ఇన్చార్జిగా ఉన్నప్పటికీ.. 2014లో ఓడిపోయిన తర్వాత.. పెద్దగా క్రియాశీలంగా ఉన్నదేమీ లేదు. తాజాగా తన వ్యాపారావసరాలకోసం తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నట్లుగా జిల్లాలో చెప్పుకుంటున్నారు.

వ్యాపారాల కోసమే… బాబు పంచకు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share