ఆ ఒక్క మంత్రి చాలు.. బాబు ప‌రువు తీసేయ‌డానికి..!

February 24, 2018 at 11:15 am
chandra babu, AP, CM, Minister, Adinarayan reddy

అడుసు(బుర‌ద‌) తొక్క‌నేల‌.. కాలు క‌డ‌గ‌నేల‌- అనే సామెత మ‌రోసారి ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా బాధ్య‌తాయుత‌మైన మంత్రి స్థానంలో ఉన్న నేత‌.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగేయ‌డం.. త‌ర్వాత దీనిపై మీడియాలో ర‌చ్చ రేగితే నాలిక క‌రుచుకుని.. అయ్యో మొర్రో.. అంటూ.. మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వ‌డం ఇట‌వల కాలంలో కామ‌న్ అయిపోయింది. తాజాగా ఏపీ మంత్రివ‌ర్గంలో కీల‌క స్థానంలో ఉన్న జంపింగ్ నేత ఒక‌రు ఇలానే నోరు పారేసుకుని  గుప్పిట మూసి ఉంచాల్సిన ర‌హ‌స్యాల‌ను బహిర్గతం చేసేశాడు. 

 

ఫ‌లితంగా అవి కాస్తా.. టీడీపీకి, పార్టీ అధినేత కు కూడా మ‌చ్చ తెచ్చాయి. ఈ విష‌యం గ్ర‌హించే లోగానే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. దీంతో నాలిక క‌రుచుకున్న స‌ద‌రు నేత మ‌ళ్లీ ప‌నిగ‌ట్టుకుని మీడియా మీటింగ్ పెట్టాల్సిన దుస్థితి వ‌చ్చింది. ఇది ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ త‌రఫున గెలిచి, త‌ర్వాత చంద్ర‌బాబు కూట‌మిలో చేరి కేబినెట్ బెర్త్‌ను సొంతం చేసుకున్న మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి వైఖ‌రి తీవ్ర వివాదాస్ప‌దం అయింది.

 

జ‌మ్మ‌ల మ‌డుగు నుంచి 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలుపొందిన ఆది నారాయ‌ణ రెడ్డి త‌ర్వాత టీడీపీలో చేరిపోయాడు. ఆ త‌ర్వాత ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అయితే, ఇక్క‌డ కొన్నేళ్లుగా ఆయ‌న‌కు టీడీపీ నేత రామ‌సుబ్బారెడ్డికీ వైరం కొన‌సాగుతోంది. అయితే, పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం, విప‌క్షాన్ని బ‌ల‌హీన ప‌ర‌చ‌డం అనే కార్య‌క్ర‌మంలో భాగంగా చంద్ర‌బాబు ఆదిని పార్టీలో చేర్చుకున్నారు. అదే స‌మ‌యంలో స‌హజంగానే ఆయ‌న ఇరువురు నేత‌ల‌నూ స‌ఖ్య‌త‌గా మెల‌గాల‌ని సూచించారు. అయితే, ఈ విష‌యంలో ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శించిన మంత్రి ఆది.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. బాబునే నిలువునా ఇరికించేశాడు.

 

నేను, రామసుబ్బారెడ్డి గతంలో ప్రత్యర్థులం… ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటించాలని కార్యకర్తలకు చెప్పాను… ఇకపై అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమభాగం పంచుకోమని అధికారులు, నాయకులందరి సమక్షంలో సీఎం బహిరంగంగానే చెప్పారు అని మంత్రి ఆది. అంతేకాదు, మ‌రో అడుగు ముందుకేసి.. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏ పనులు చేసినా చెరో సగం పంచుకోవాలని సీఎం చెప్పారని వెల్లడించారు. తాను, రామసుబ్బారెడ్డి ఎటువంటి ప్రతిపాదనలు పెట్టినా చేస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. 

 

కోటి రూపాయల పనులు వస్తే రామసుబ్బారెడ్డి, తాను చెరోసగం తీసుకోవాలని, కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పానని అన్నారు. ఇవి తీవ్ర వివాదం రేపడంతో మ‌రోసారి మీడియా మీటింగ్ పెట్టి స‌రిదిద్దుకునే కార్య‌క్ర‌మం చేప‌ట్టాడు. అయితే, అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. మ‌రి ఇప్ప‌టికైనా మంత్రి ఆది త‌న హ‌ద్దులు తెలుసుకుంటాడో?  లేక అధినేత తో క్లాస్ పెట్టించుకుంటాడో చూడాలి. 

 

ఆ ఒక్క మంత్రి చాలు.. బాబు ప‌రువు తీసేయ‌డానికి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share