కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన అవిశ్వాసం

March 17, 2018 at 1:24 pm
chandra babu, KCR, YS jagan, AP Special Status, Aviswasa theermanam,

కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఒక్క‌తాటిపైకి వ‌స్తున్న స‌మ‌యంలో మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ జోరు త‌గ్గించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. మ‌రీ ముఖ్యంగా ఎన్డీఏ ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా ఎవ‌రు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. దానికి ఆయ‌న అంద‌రి కంటే ముందుగా మ‌ద్ద‌తు తెలిపాలి. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వంపై వైసీపీ, టీడీపీ.. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు నోటీసులిస్తే.. ఇప్ప‌టికీ ఒక కొలిక్కి రాలేక.. ముందుకు వెళ్ల‌లేక.. ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతు న్నార‌ట‌. సుదూర‌ ప్ర‌యోజ‌నాలు లేకుండా ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకోర‌న్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇందులోనూ కేసీఆర్ ఇలాంటివి ఆలోచించారా? ఆలోచించి ఇలా ఇరుక్కుపోయారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది!

 

థ‌ర్డ్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తానే నాయక‌త్వం వ‌హిస్తాన‌ని చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వ్య‌తిరేక పార్టీల నేత‌ల‌తో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో.. థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా మరింత జోరు పెంచాల్సిన టైమ్‌లో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం సందేహాలు పుట్టేలా చేస్తోంది. జాతీయ స్థాయి రాజ‌కీయ‌ల్లోకి గులాబీ నేత వెళ‌తార‌ని తేలిపోయిన నేప‌థ్యంలో.. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్ని ఇంకా అందుకోకుండా వేచిచూస్తుండ‌టం వెనుక ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ‌తాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టంతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో ఆ గులాబీదళం డైలమాలో పడింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతోంద‌ట‌.  

 

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. టీడీపీ, వైసీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇప్పుడు.. గులాబీ అధినేత‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాయి. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌.. వాస్తవానికి ఈ తీర్మానానికి మద్దతు తెలపాలి. మరి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రత్యేకహోదా అంశంపై టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతునిస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమిటన్న చ‌ర్చ‌ గులాబీ పార్టీలో జ‌రుగుతోంద‌ట‌. రాజకీయంగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు అవిశ్వాసానికి మద్దతు పలికాయి. 

 

టీఆర్‌ఎస్‌ కూడా మద్దతు తెలిపితే ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న సంకేతాలు వెళ్తాయన్న వాదన గులాబీ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశమే లేదని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. శుక్రవారం సభ అదుపులో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాలను స్వీకరించడం లేదని స్పీకర్‌ తేల్చి చెప్పారు. దీంతో సోమవారమైనా ఈ తీర్మానాలను స్వీకరిస్తోందో లేదో తెలియదు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా అడ్డుకుంటుందన్న అంచనాలో ఉన్నార‌ట‌. దీంతో అవిశ్వాస తీర్మానం చర్చకు రాదని.. ఏ నిర్ణయం తీసుకోవాల్సి అవసరం లేదన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణుల వాదన. అవిశ్వాస తీర్మానం ఒకవేళ స్వీకరించి సభలో చర్చకు వస్తే ఏం చేయాలన్నదానిపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం లేకపోవడంతో తటస్థంగా ఉండాలన్న యోచనలో టీఆర్‌ఎస్ ఉంద‌ట‌.

 

కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన అవిశ్వాసం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share