పోల‌వ‌రంతో చంద్ర‌బాబు అరుదైన రికార్డు..

June 12, 2018 at 6:31 pm
chandra babu, polavaram Project, new record, TDP, daighram wall,

ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో త‌న‌ను మించిన వారు లేర‌ని ఏపీ సీఎం చంద్రబాబు మ‌రోసారి నిరూపించారు. 2019 ఎన్నిక‌ల‌కు త‌న‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని భావిస్తున్న‌, ఏపీకి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే! ఇందులో కీల‌క‌మైన `డ‌యాఫ్ర‌మ్ వాల్‌` (ఎర్త్ క‌మ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన పునాది)ని శంకుస్థాప‌న చేయ‌డంతో పాటు దానిని జాతికి అంకిత‌మిచ్చాన‌ని చెబుతున్న తీరుపైనే స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసి.. దానిని ప్రారంభించే స‌మ‌యంలో ఎవ‌రైనా జాతికి అంకిత‌మ‌ని చెబుతారని, కానీ ఇలా శంకుస్థాప‌న చేసి అంకిత‌మిచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే దీనిని నిర్మించాల్సి ఉన్నా.. ట్రాన్స్‌ట్రాయ్ జాప్యంతో పాటు బాబు ఉదాసీన వైఖ‌రి వ‌ల్ల‌ ఇప్పుడు ప్రారంభించాల్సి వ‌చ్చింద‌ని నీటిపారుద‌ల శాఖాధికారులే పెద‌వి విరుస్తున్నారు.

ఎప్పుడో జ‌ర‌గాల్సిన ప‌నుల‌కు ఇప్పుడు శంకుస్థాప‌న చేసి.. దానిని కూడా జాతికి అంకిత‌మిచ్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుందనే విమర్శ‌లు వినిపిస్తున్నాయి. పోలవరం ఏపీకి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అనటంలో ఎలాంటి సం దేహం లేదు. దీనిని గుర్తించిన చంద్ర‌బాబు.. తన రెండు క‌ళ్ల‌లో ఒక‌టి పోల‌వ‌రం, మ‌రొక‌టి అమ‌రావ‌తి అని చెప్పు కొచ్చారు. పోల‌వ‌రం నిర్మాణం త‌న పూర్వ జ‌న్మ సుకృతమంటూ సెంటిమెంట్ డైలాగులు చెబుతున్నారు. పోల‌వ‌రాన్ని పూర్తి చేసిన ఘ‌న‌త కేంద్రానికి ద‌క్క‌కుండా తానే స్వ‌యంగా నిర్మించి..ఆ క్రెడిట్ అంతా త‌న జేబులో వేసేసుకుందా మ‌నుకున్నారు టీడీపీ అధినేత‌. అందుకే కేంద్రంతో పోరాడి మ‌రీ.. ఆ ప‌నుల‌న్నీ ఆయ‌నే స్వ‌యంగా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 2018 చివరి నాటికి పోలవరం తొలి దశ పూర్తి చేస్తామ‌ని, గ్రావిటీ ద్వారా నీరందిస్తామ‌ని చెబుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు `డయాఫ్రమ్ వాల్`ని జాతికి అంకితం చేస్తారంట.

412 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయటం నిజంగా రికార్డే. ఇందులో ఎలాంటి వివాదాలకు తావు లేదు. కానీ చంద్రబాబు ఏకంగా పోలవరంలో లేని తొలి దశ ప్రాజెక్టునే 2018 డిసెంబర్ కు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు పలుమార్లు. అయినా డయాఫ్రమ్ వాల్ ని జాతికి అంకితం చేసేది ఏమిటనే ప్ర‌శ్న వినిపిస్తోంది. ఇప్పటికే పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ పై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కావటంతో ఈ పనులు ఇఫ్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఉన్నతాధికారులు సూచించినట్లు ట్రాన్స్ స్ట్రాయ్ ను పక్కకు తప్పించి.. పోలవరం పనులు పరుగు పెట్టించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సాగునీటి శాఖకు చెందిన అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం `ట్రాన్స్ స్ట్రాయ్`పై వ‌ల్ల‌మాలిన అభిమానంతో వారిని వారించారు.

చివరకు ట్రాన్స్ స్ట్రాయ్ ఉంటే పని ముందుకు సాగదని గుర్తించిన చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఒకప్పుడు అడ్డగోలుగా వెనకేసుకొచ్చిన ట్రాన్స్ స్ట్రాయ్ నుంచి అన్ని పనులు తప్పిస్తూ ఇతరులకు అప్పగించేస్తూ కమిషన్లు దండుకునే పనిలో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్నార‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. కొన్ని రోజులుగా చంద్రబాబు పోలవరంలో జాప్యం నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చి మూడు నెలలే గడిచింది. కానీ తన తప్పులను కూడా ఇప్పుడు కేంద్రంపై నెట్టేసి.. అంచనాలు పెంచటంతోపాటు.. ప్రతి దాన్ని ఒక ఈవెంట్ లా చేసి ప్రజలను మభ్యపెట్టడంలో మాత్రం చంద్రబాబు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నార‌నే ఆరోప‌ణ‌లు జోరందుకున్నాయి.

పోల‌వ‌రంతో చంద్ర‌బాబు అరుదైన రికార్డు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share