ఎంపీ రేసులో బాబు…ఏంటి కథ?

July 3, 2018 at 10:18 am
chandra babu, TDP, In MP race, national politics, AP cm

`నాకు గ‌తంలోనే ప్ర‌ధాన మంత్రి ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ నాకు ఆంధ్ర రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం. అందుకే ఆ ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేశా` అంటూ జాతీయ రాజకీయాల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక స‌మయంలో సీఎం చంద్ర‌బాబు వీటిని ప్ర‌స్తావించ‌కుండా ఉండ‌లేరు. కానీ ఇప్పుడు ఆయ‌న ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చిందా? దేశ రాజ‌కీ యాల‌పై ఆయ‌న ఆస‌క్తి చూపుతున్నారా? ఒక‌ప‌క్క తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా జాతీయ రాజ‌కీయా ల‌పై పూర్తిగా దృష్టిసారించిన నేప‌థ్యంలో తాను కూడా ఈ ఫార్ములానే పాటించాల‌ని బాబు డిసైడ్ అయ్యారా? అంటే అవుననే స‌మాధాన‌మే పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

మ‌రి దేశం కంటే రాష్ట్ర‌మే ముఖ్య‌మ‌ని చెప్పిన ఆయ‌నే.. ఇప్పుడు ఈ ఆలోచ‌న ఎందుకు చేస్తున్న‌ట్లు అనే అనుమానం రాక‌మాన‌దు క‌దా! దీని వెనుక చాలా పెద్ద క‌థే ఉంద‌ని చెబుతున్నారు ఆయ‌న సన్నిహితులు! రాష్ట్ర రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌లు ముంద‌స్తుగా జరిగిపోతాయ‌నే ప్ర‌చారం కూడా బ‌లంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో బ‌హుముఖ పోరు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు కూడా! టీడీపీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. మ‌రోప‌క్క ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు రోజురోజుకూ పెరుగుతోంది. ఇది ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను స్ప‌ష్టం చేస్తోందంటున్నారు విశ్లేష‌కులు.

మ‌రోప‌క్క హోదా సెంటిమెంట్‌నే ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా చేసుకుని వైసీపీ బ‌రిలోకి దిగ‌నుంది. ఇక పార్టీ ఎంపీల రాజీనామాలు ప్ర‌జ‌ల్లో సానుభూతి క‌లిగేలా చేశాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ ఎడ్జ్ ఉంద‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. దీంతో సీఎం చంద్ర‌బాబు.. త‌న రాజ‌కీయ అనుభ‌వాన్నంతా ఉప‌యోగించి.. ఎలాగైనా వైసీపీ క్రేజ్ త‌గ్గించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇదే స‌మ‌యంలో ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ సాధిస్తే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న భ‌యం చంద్ర‌బాబులో వ్య‌క్తం అవుతోంద‌ట‌. అందుకే ఆయ‌న ర‌క‌ర‌కాల దీక్ష‌లు చేయిస్తున్నారు. అయినా ఫ‌లితంలో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని తేలిపోయింది.

అంతేగాక జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో రాయ‌ల‌సీమ జిల్లాల‌తో పాటు నెల్లూరు,ప్ర‌కాశం,ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో వైసీపీకి బ‌లం పెరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలు వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎలాగైనా వైసీపీ మైలేజ్ ను త‌గ్గించేందుకు ఓ కొత్త నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట చంద్ర‌బాబు. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు కుప్పం నుంచి పోటీ చేస్తూనే, ఎంపీగా కూడా బ‌రిలోకి దిగాల‌నుకుంటున్నారట‌.

నెల్లూరు, ఒంగోలు, లేదంటే రాయ‌ల‌సీమ ప‌రిధిలోని లోక్ స‌భ సీట్ల‌లో ఏదైనా ఒక చోటు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంద‌న్న దానిపై పార్టీ నేత‌ల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ట. కాలం క‌లిసొచ్చి, మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఏపీని చిన‌బాబు లోకేష్ చేతుల్లో పెట్టేసి, తాను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోవాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఏపీలో టీడీపీ ఓడిపోతే, జ‌గ‌న్ ముందు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా తాను ఉండ‌లేన‌ని చంద్ర‌బాబు వాపోతున్నార‌ట‌. టీడీపీ ఓడిపోయినా, గెలిచినా ఇక‌పై ఎంపీగా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతూ.. రాష్ట్రంలో పార్టీకి తోడునీడ‌లా ఉండాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రోప‌క్క కేసీఆర్ కూడా ఎంపీగానే పోటీచేస్తార‌ని గులాబీ నేత‌లు చెబుతున్నారు. మ‌రి దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన బాబు.. మ‌ళ్లీ పూర్తిస్థాయిలో ఢిల్లీని శాసిస్తారో లేదో వేచిచూడాల్సిందే!

ఎంపీ రేసులో బాబు…ఏంటి కథ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share