కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు … పెద్ద గందర గోళం

May 18, 2018 at 5:53 pm
COngress and JDS MLA, Hyderbad Travel, reasons, Karnataka Elections 2018

క‌ర్ణాట‌క హైడ్రామా హైద‌రాబాద్ చేరింది. రేపు సాయంత్రం 4గంట‌ల క‌ల్లా క‌ర్ణాట‌క‌లో కొలువు దీరిన యెడ్డీ ప్ర‌భుత్వం బ‌లం నిరూపించుకోవాల‌ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో జేడీఎస్‌, కాంగ్రెస్‌లు త‌మ ఎమ్మెల్యేల‌ను అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య హైద‌రాబాద్‌కు త‌ర‌లించాయి. వాస్త‌వానికి వారిని చెన్నైకానీ, కేర‌ళ కానీ, పంజాబ్‌కు కానీ త‌ర‌లించాల‌ని భావించారు. అయితే, అక్క‌డి ప్ర‌భుత్వాలు సుర‌క్షితం కావ‌ని గుర్తించిన నాయ‌కులు చివ‌ర‌కు జేడీఎస్‌కు అభ‌యం  ఇచ్చిన తెలంగాణకు త‌ర‌లించాయి. అయితే, ఈ ఎమ్మెల్యేల త‌ర‌లింపు అంతా అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్యే సాగ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం మేర‌కు సీఎంగా ప్ర‌మాణం చేసిన య‌డ్యూర‌ప్ప‌.. వెంట‌నే సంచ‌ల‌న ఆదేశాలు చేశారు. 

 

కాంగ్రెస్, జేడీఎస్ కూట‌మి ఎమ్మెల్యేలున్న ఈగ‌ల్ట‌న్ గోల్ఫ్ రిసార్ట్‌, షాంగ్రీ-లా హోట‌ల్ వ‌ద్ద బందోబస్తును ఎత్తివేశారు.  భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించారు. దీంతో తమ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని గుర్తించిన ఇరు పార్టీలు  వారిని వెంటనే రాష్ట్రం నుంచి తరలించాలని భావించాయి. కాంగ్రెస్‌ తరపున డీకే శివకుమార్‌, జేడీఎస్‌ తరపు న ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎమ్మెల్యేలు వారిని ఎక్కడ దాచాలన్న దానిపై మంతనాలు జరిపారు.  ఈ క్ర‌మంలోనే తొలుత వారిని ఛార్టెడ్‌ ఫ్లైట్‌ల ద్వారా కొచ్చి(కేరళ)కు తరలించాలని అనుకున్నారు. అయితే డీజీసీఏ  నుంచి విమానానికి అనుమతి లభించకపోవటం, దానికి తోడు కొచ్చిలో హోటళ్లు ఖాళీగా లేవని సమాచారం రావటంతో (ఇదంతా బీజేపీ కుట్ర అన్నది వారి ఆరోపణ) మరోచోటకు తరలించాలని నిర్ణయించాయి. 

 

అంతకు ముందు జేడీఎస్‌ సుప్రీం దేవగౌడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడి.. వారి నుంచి హామీ పొందారు. దీనికితోడు పొరుగునే ఉన్న తమిళనాడు అన్నాడీకేం ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే వారి కోసం హైదరాబాద్‌ బెస్ట్‌ ప్లేస్‌ అని భావించి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, అంతా ర‌హ‌స్యంగా ఈ తతంగాన్ని సాగించారు. తమ తరలింపు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఎమ్మెల్యేలు.. దుస్తులను నేరుగా హోటళ్ల వద్దకే తెప్పించుకున్నారు. అర్ధరాత్రి 12గం.15 ని. సమయంలో శర్మ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఈగల్‌టన్‌ రిసార్ట్‌ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరాయి. అనంతరం షాంగ్రీ-లా హోటల్‌ వద్దకు చేరుకుని అక్కడ జేడీఎస్‌ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బయలుదేరాయి. ఎమ్మెల్యేలకు భోజనం, దుప్పట్లు ఇలా అన్ని ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. 

 

అయినప్పటికీ బీజేపీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి సరిహద్దు వరకు పలు ప్రాంతా ల్లో(గౌరీ బిదనూరు, చికబళ్లాపూర్‌ జిల్లాలో) ముందస్తుగా కొన్ని వాహనాలను ఉంచారు. ఒకవేళ వారిని అడ్డుకునే యత్నా లు జరిగితే స్థానిక నేతల సాయంతో ఆయా వాహనాల్లో వారిని రహస్య ప్రదేశాలకు తరలించాలని భావించారు. శర్మ ట్రావెల్స్‌ డ్రైవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఆంధ్రా బార్డర్‌ వరకు ఎమ్మెల్యేలు జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, శివరామ హెబ్బర్‌లు స్వయంగా బస్సులు నడిపినట్లు తెలుస్తోంది. కర్నూల్‌ మీదుగా ప్రయాణించిన వాహనాలు ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు 80 కిలోమీటర్లు దూరంలో ఆగారు. అక్కడ ఎమ్మెల్యేలు కాఫీ బ్రేక్‌ తీసుకున్నాక తిరిగి బయలుదేరారు. చివరకు గంటర్నర ప్రయాణం తర్వాత నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా క‌ర్ణాట‌క హైడ్రామా.. మొత్తం..  హైద‌రాబాద్‌కు చేరుకుంది. త‌దుప‌రి ఘ‌ట్టంఏం జ‌రుగుతుందో చూడాలి .

 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు … పెద్ద గందర గోళం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share