అది కాదుగానీ మరోటిస్తాం. ప్లీజ్…!

October 12, 2018 at 3:34 pm

ఆమె మాత్రం ఫలానా చోటనుంచే ఎమ్మెల్యే సీటు కావాలని పట్టుబడుతున్నారు. మొన్నటిదాకా పార్టీ సంగారెడ్డి కాదు కదా.. అసలు టికెట్ అంటూ ఇవ్వడమే అసాధ్యం అంటూ బీరాలు పలుకుతూ వచ్చింది. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆమె కాస్తా పార్టీ మారిపోవడానికి కూడా సిద్ధపడడంతో, సారీ- మారిపోవడంతో, పార్టీనే కాళ్లబేరానికి వచ్చింది. కాకపోతే.. అడిగినది కాకుండా ఏదో ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తాం అంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

అవును ఇదంతా పద్మినీరెడ్డికి సంబంధించిన గొడవే.

Padmini Damodar

కాంగ్రెస్ పార్టీలోని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ భార్య ఆమె. నిజానికి ఆమెకు రాజకీయాసక్తి ఎక్కువే. కనుకనే సంగారెడ్డి ప్రాంతంలో సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో టికెట్ కోసం చాలా గట్టిగా ప్రయత్నించినా ఫలం దక్కలేదు. ఒక ఫ్యామిలీలో రెండు టికెట్లు ఇవ్వడం సిద్ధాంతం కాదంటూ తిరస్కరించారు. ఆ సందర్భంలో ఆమె మిన్నకుండిపోయారు.

తీరా ఇప్పుడు ఎన్నికల్లో కూడా టికెట్ కోసం గట్టిగా ఆశ పెట్టుకున్నా పార్టీనుంచి అదే సిద్ధాంతం ఎదురైంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన పద్మినీరెడ్డి.. పార్టీని వీడి భాజపాలో చేరారు. అసలే మహాకూటమి ముసుగులో పార్టీ రకరకాల కుమ్ములాటలతో సతమతం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దామోదర వంటి సీనియర్ నాయకుడి భార్య పార్టీని వీడిపోయిందంటే ఎంత పరువు నష్టం అంటూ కంగారు పడ్డారు. మంతనాలు సాగించారు.

భాజపాలో చేరి, తిరిగి ఇంటికి వెళ్లిన ఆమె అప్పటికే మనసు మార్చుకున్నారు. అలా అనడం కంటె.. వాతావరణం ఆమె మనసు మార్చుకునేలా తయారైందంటే బాగుంటుంది. దామోదర సహా అందరూ ఆమెను బుజ్జగించారు. కానీ ఒక చిక్కొచ్చి పడింది. ఆమె సంగారెడ్డి సీటు కోసం పట్టుపడుతున్నారు. భాజపాలో కూడా ఆ డిమాండ్ తోనే చేరారు. కాకపోతే.. సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది.

ఇలాంటి నేపథ్యంలో ఆమెకు సంగారెడ్డి కాకుండా, మరో సీటు ఇవ్వగలం అని, అలక పూనకుండా పార్టీని వీడకుండా ఉండాలని నాయకులు బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇలాంటి రాజీ ఫార్ములాలకు పద్మినీరెడ్డి ఎలా స్పందిస్తారో ఏమో వేచిచూడాలి.

అది కాదుగానీ మరోటిస్తాం. ప్లీజ్…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share