కాంగ్రెస్ మెట్టు దిగకుంటే పొత్తులు అసాధ్యం!

September 8, 2018 at 11:13 am

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడం వలన సాధించేదంటూ ఏమీ లేదు. అంతో ఇంతో పరువుదక్కేలా సీట్లు గెలుచుకోవాలంటే.. వారికి కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి. ఇంతగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం కాస్త మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పొత్తులు కుదుర్చుకోవడానికి అన్ని ఇతర పార్టీలతోనూ చర్చలు షురూ చేస్తున్న వేళ.. ఏ ఒక్క చిన్న పార్టీ కూడా అంగీకరించే అవకాశం లేని రీతిలో పొత్తు సమీకరణాలను ప్రతిపాదిస్తోంది.

ముందస్తు ఎన్నికల వేడి మొదలైపోయిన తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా వరుస భేటీలతో చాలా చురుగ్గా పావులు కదుపుతున్నారు. సమీకరణాలను బేరీజు వేస్తున్నారు. ఉన్నసీట్లను కలిసి వచ్చే పార్టీలతో ఎలా పంచుకోవాలో ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వారి నిర్ణయం మేరకు మొత్తం 119 స్థానాలకు గాను పొత్తులు కుదిరే మిత్రులందరికీ కలిపి 29 స్థానాలు కేటాయించి.. 90 స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతానికి టిజెఎస్, సీపీఐ, వీలైతే సీపీఎం, తెలుగుదేశం లతో కూడా పొత్తు పెట్టుకోవాలనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన. ఆ ప్రకారం అన్ని పార్టీల నాయకులతోనూ ఆయన టచ్ లోనే ఉన్నారు. ఒకవేళ వారు కోరుకుంటున్నట్లుగా ఈ అన్ని పార్టీలూ కలిసి మహాకూటమిగా ఏర్పడడం ఆచరణ సాధ్యం అయితే గనుక.. 29 సీట్లనే ఆ నాలుగు పార్టీలు పంచుకోవాలన్న మాట. వామపక్షాలు చెరో 3-5 స్థానాలు డిమాండ్ చేస్తే.. మహా అయితే టిజెఎస్, తెదేపాలకు కలిపి 20 మిగులుతాయి. ఎవరెన్ని పంచుకోవాలి! ప్రతిష్టంభనే తప్ప పొత్తులు ముందుకు సాగవు.

అందుకే కాంగ్రెస్ తమ పార్టీకి కేటాయించదలచుకున్న సీట్ల సంఖ్యను తగ్గించుకుంటే తప్ప.. కూటమి ఏర్పడగల అవకాశం లేదని.. కేసీఆర్ ను ఓడించాలనే చిత్తశుద్ధి నిజంగా వారికుంటే.. తదనుగుణంగా.. తమ కోటాను త్యాగం చేసి కోతపెట్టుకోవాలని, మెట్టు దిగాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

uttam-kumar-reddy-759

కాంగ్రెస్ మెట్టు దిగకుంటే పొత్తులు అసాధ్యం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share