ఈ బంధం.. బాబుకు భస్మాసుర ‘హస్తం’!

September 10, 2018 at 10:04 am
Congress, TDP, Aligns, Telangana, May more damage to TDP, In Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ గురించి పూర్తిగా తెలిసిన వారెవ్వరూ.. చరిత్రలో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆ పార్టీ కాంగ్రెస్ తో జట్టు కడుతుందని ఊహించలేరు. అయితే అలాంటి వారి నమ్మకానికి చాన్నాళ్ల కిందటే తెరపడింది. కర్నాటక సీఎం ప్రమాణ స్వీకార సందర్భంలోనే.. రాహుల్ తో రాసుకుపూసుకు తిరిగే బాబు యావ గమనించిన వాళ్లు త్వరలోనే వీరి పొత్తు బంధం ఏర్పడుతుందని ఆనాడే ఊహించారు. తెలుగుదేశం కాస్తా.. తెలుగుకాంగ్రెస్ గా మారుతుందని కూడా గెస్ కొట్టారు. అది ఇన్నాళ్లకు తెలంగాణ ఎన్నికల రూపేణా కార్యరూపంలోకి వచ్చినట్లుంది.

Gandhi-Naidu-keLG--621x414@LiveMint

తెలంగాణ కాంగ్రెస్ తో తెదేపా పొత్తు దాదాపుగా ఖరారైపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ ఆల్రెడీ ఫోన్లలో మాట్లాడుకున్నారు. అంతకంటె పెద్ద తలకాయలు అంతకంటె రహస్యంగానే ఒక ఒప్పందానికి కూడా వచ్చి ఉంటారని అనుకోవచ్చు. స్థానిక నేతల నిర్ణయం, స్థానికంగా పార్టీ అవసరం, వ్యూహం మేరకే ఈ పొత్తులు ఉండబోతున్నట్లు కలర్ ఇస్తున్నారు.

వారు ఎలా టముకు వేసుకున్నా సరే.. కాంగ్రెస్ జట్టు కట్టడం అనేది తెలుగుదేశం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన ప్రభావం చూపిస్తుందనే సంగతి తెలియని వాళ్లెవరూ లేరు. నిజానికి తెలంగాణ లో కూడా వారికి ఏం లాభం ఒనగూరుతుందో అంచనాలకు చిక్కడం లేదు. పొత్తుల ద్వారా తీసుకున్న సీట్లలో పోటీచేసినప్పుడు.. కాంగ్రెస్ (తిరుగుబాటు అభ్యర్థులు లేకుంటే) వారి ఓట్లు తెదేపాకు పడతాయేమో గానీ.. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ను ద్వేషిస్తూ వచ్చిన తెదేపా అభిమానులు మరీ దిగజారి ఆ పొత్తులను ఎలా హర్షిస్తారు? అనే ప్రశ్న పలువురిలో వినిపిస్తోంది. ఆ రకంగా చూసినప్పుడు…. ప్రత్యేకంగా కాంగ్రెస్ తో పొత్తు వలన తెలుగుదేశం లాభపడే శాతం తక్కువే అని కొందరు అనుకుంటున్నారు.

TDP-CONG

కాగా, ఈ పొత్తువలన రేపు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశానికి పెనునష్టం తప్పదు. ‘‘కాంగ్రెస్ వారు విభజన సమయంలో చేసిన తప్పును దిద్దుకుంటూ.. ప్రత్యేకహోదా ఇస్తాం అని ఇప్పుడు చెబుతున్నారు…’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు గానీ.. ప్రజలు ఆ మాటలను విశ్వసిస్తారనే గ్యారంటీ లేదు. ఏ రకంగా చూసినా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు అనేది చంద్రబాబుకు నెత్తిన భస్మాసుర హస్తంగా మారుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Uttam-Kumar-Reddy-L-Ramana

ఈ బంధం.. బాబుకు భస్మాసుర ‘హస్తం’!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share