దానంపై గులాబీదళం కుట్ర చేస్తోందా?

September 11, 2018 at 2:59 pm

హైదరాబాదు నగర కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక కీలకమైన నాయకుడు అయిన దానం నాగేందర్ ను తెరాసలో చేర్చుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఒకమారు.. ఆయన దాదాపుగా చేరిపోయినట్లే అని కూడా ప్రచారం జరిగింది. అయితే మొత్తానికి కేవలం రెండు నెలల కిందట జూన్ లో దానం నాగేందర్ గులాబీతీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకు మంత్రి హోదాతో ఏదైనా పదవి కట్టబెట్టే హామీ ఇచ్చారని ఒక పుకారు వినిపించింది గానీ.. అదేమీ జరగలేదు. ఈలోగా ముందస్తు ఎన్నికలు కూడా వచ్చేశాయి. కాంగ్రెస్ వి 3, తెరాస పెండింగులు 5, మజ్లిస్ 2 తీసేస్తే ఇక మిగిలింది రాజధాని నగరానికి సంబంధించిన భాజపా స్థానాలు నాలుగు మాత్రమే.

ప్రస్తుత పరిణామాలను లోతుగా గమనిస్తే.. దానం నాగేందర్ కు వ్యతిరేకంగా గులాబీ పార్టీలో పెద్ద కుట్ర జరుగుతున్నదేమో అనిపిస్తోంది. దానం నాగేందర్ తనకు ఖచ్చితంగా కావాలంటున్న సీటును ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది పార్టీ ఇష్టం. కానీ.. ఫలానా చోట నేను గెలవను, నాకు ఆ సీటు వద్దంటే వద్దు అని ఆయన అంటున్న స్థానాన్నే బలవంతంగా కట్టబెట్టాలని చూస్తున్నారంటే దాన్ని కుట్ర కాక ఇంకేం అనుకోవాలి. అలాంటి పరిస్థితిలో దానం నాగేందర్ సంకటంలో ఉన్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

danam-joins-trs

దానం నాగేందర్ కు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయాలనేది ఆశ. ఆయన సొంత సామ్రాజ్యం ఆ పరిధిలోనే ఉంటుంది. అది ప్రస్తుతం భాజపా చేతిలో ఉంది. భాజపాను ఓడించడం అనేది పట్టుదల తెరాసకు ఉన్నది గానీ, ఆ స్థానాన్ని దానంకు ఇచ్చే ఉద్దేశం వారికి లేదు. ఆయనకు గోషామహల్ సెగ్మెంటు ఇస్తామని అంటున్నారు. అది కూడా బీజేపీ సీటే. అక్కడ 2014లో రాజాసింగ్ గెలిచారు. ఆయన ప్రస్తుతం భాజపాకు రాజీనామా చేశారు. ఈసారి ఏ పార్టీ తరఫున ఉంటారో తెలియదు.

అప్పట్లో గోషామహల్ లో కాంగ్రెస్ కు చెందిన ముఖేష్ గౌడ్ కు 45వేల ఓట్లు వస్తే , రాజాసింగ్ కు 92 వేల ఓట్లు వచ్చాయి. 47 వేల మెజారిటీ. తెరాసకు వచ్చింది 6 వేల ఓట్లే. అంత ఘోరమైన నియోజకవర్గాన్ని తనకు కేటాయించడం అంటే దానం ఉడికిపోతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదని అంటున్నారు. నగరంలో మరో సీటు అంటే.. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట్ కూడా ఉంది. ఆ సీటు కిషన్ రెడ్డికి కంచుకోట అనే పేరుంది. ఆ సీట్లు మాత్రమే పరిగణిస్తున్నారంటే.. దానం విషయంలో పొమ్మనకుండా పొగబెట్టినట్లే అని అంతా అనుకుంటున్నారు.

దానంపై గులాబీదళం కుట్ర చేస్తోందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share