దేవ‌గౌడ వార‌సుల వార్‌… జేడీఎస్ చీల‌నుందా..!

May 15, 2018 at 5:04 pm
Deva gowd, sons, JDS, kumara swami, conflicts, divide

కర్ణాటకలో రాజ‌కీయం ర‌స‌ప‌ట్టులో ప‌డింది. క్షణం క్షణం రాజకీయ ప‌రిణామాలు మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 78సీట్లు, బీజేపీ 104సీట్లు, జేడీఎస్ 38సీట్లు, ఇత‌రులు రెండు సీట్ల‌లో విజ‌యం సాధించారు. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్దిపాటి దూరంలో ఆగిపోయిన బీజేపీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో జేడీఎస్‌తో జ‌త‌ కట్టి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 

 

ఇప్పటికే బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మంతనాలు జరిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. దళపతి దేవేగౌడకు ఫోన్ చేసి, మంతనాలు జరిపిన‌ట్లు స‌మాచారం. ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు గులాం న‌బీ ఆజాద్‌, అశోక్ గెహ్లాట్ ఇప్ప‌టికే జేడీఎస్ నేత‌లు దేవేగౌడ‌, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో మంత‌నాలు జ‌రిపారు. ఇదే విష‌యాన్ని విలేకరుల స‌మావేశంలో వారు వెల్ల‌డించారు. బ‌య‌టి నుంచి జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

 

కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జేడీఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న కాంగ్రెస్ మాట‌కు దేవేగౌడ ఒప్పుకోన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వంలో క‌ల‌వాల‌ని ఆయ‌న సూచింన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద‌సంఖ్య‌లో మంత్రి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

 

ఇక ప్ర‌భుత్వ ఏర్పాటుపై బీజేపీ కూడా ధీమా ఉంది. జేడీఎస్ కీలక నేత, దేవేగౌడ కుమారుడు రేవణ్ణతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. తనతో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీకి రేవణ్ణ భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే… కన్నడ నాట జేడీఎస్ నిలువునా చీలి, బీజేపీ మరోసారి అధికారంలోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అయితే ఈ ప‌రిణామాల‌ను ప‌సిగ‌ట్టిన దేవేగౌడ వెంట‌నే రేవ‌ణ్ణ‌ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. సెక్కుల‌ర్ భావాలు క‌లిగిన పార్టీ బీజేపీతో క‌లిసి జ‌నంలో ప‌రువు పోతుంద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. 

 

దేవ‌గౌడ వార‌సుల వార్‌… జేడీఎస్ చీల‌నుందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share