కొండంత‌ హామీలను గుండ ల‌క్ష్మీదేవి నెరవేర్చారా!…లేదా..!

శ్రీకాకుళం జిల్లాలో మంచి వ్య‌క్తిగా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాజీ మంత్రి గుండ అప్ప‌ల‌నాయుడు. జిల్లా కేంద్ర‌మైన శ్రీకాకుళం నుంచి వ‌రుస‌గా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఆయ‌న 2004, 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచి ఆయ‌న త‌ప్పుకుని త‌న భార్య ల‌క్ష్మీదేవిని రంగంలోకి దించారు. ల‌క్ష్మీదేవి మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావుపై భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు గృహిణిగా ఉన్న ఆమె ఇప్పుడు భ‌ర్త లాగానే పిలిస్తే ప‌లికే ఎమ్మెల్యేగా ప్ర‌జాభిమానం పొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ మూడున్న‌రేళ్ల‌లో ఆమె నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు ఇచ్చిన హామీలు ఏంటి ? వాటిల్లో ఏం నెర‌వేర్చారో ? ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ల‌క్ష్మీదేవి ప్ర‌జ‌ల దృష్టిలో మంచి వ్య‌క్తిగా ఉన్నారు. చంద్ర‌బాబు స‌ర్వేలోను ఆమెకు మంచి మార్కులే ఉన్నాయి. త‌న భ‌ర్త ఎలాగైతే ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడన్న పేరు ప్రతిష్టలు సాధించారో ఈమే కూడా అదే రూట్లో వెళుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గుండ లక్ష్మీదేవి నిత్యం కార్యకర్తలకు అందుబాటులో వుంటూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం జ‌నంలోనే ఉండ‌డంతో పాటు సామాన్యుల‌కు కూడా అందుబాటులో ఉంటున్నారు.

అభివృద్ధి ఎలా ఉందంటే…

ల‌క్ష్మీదేవికి వ్య‌క్తిగ‌తంగా మంచి పేరు ఉన్నా ఆమె ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డంలో మాత్రం ఆశించిన మేర స‌క్సెస్ కాలేదు. శ్రీకాకుళంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, కోడి రామ్మూర్తి స్టేడియం పునర్ నిర్మాణం, నిరుపేద కుటుంబాలకు ఎన్టీఆర్ గృహాలు, అరసవిల్లి మాస్టర్ ప్లాన్, శ్రీకాకుళం మండలానికి రక్షిత మంచినీటి పథకం, గార మండలానికి ఎత్తిపోతల పథకం, బైరిదేశి గెడ్డ పనులు పూర్తి చేసి, చిట్టచివరి పొలాలకు సాగునీరందించడం లాంటి హామీలు ఇంకా కార్య‌రూపం దాల్చ‌లేదు.

ప‌ట్ట‌ణంలో అవుటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయాయి. కోడి రామ్మూర్తి స్టేడియం పునర్ నిర్మాణానికి సీఎం హోదాలో చంద్ర‌బాబు ఎప్పుడో రెండేళ్ల క్రితం శిలాఫ‌ల‌కం వేసినా ఇప్పట‌కీ అతీగ‌తీలేదు. గార మండలంలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు విడుదలైనా, ఇంకా టెండర్ల దశ దాటలేదు. ఇక కార్పొరేష‌న్‌గా మారిన శ్రీకాకుళంలో వార్డుల విభ‌జ‌న‌పై ఆమె విప‌క్షం నుంచే కాకుండా స్వ‌ప‌క్షం నుంచి కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. మేయ‌ర్ కుర్చీలో ఆమె త‌న భ‌ర్త‌ను కూర్చోపెట్టే ప్లాన్‌తోనే ఇదంతా చేసిన‌ట్టు కూడా గుస‌గుసలు ఉన్నాయి.

రాజ‌కీయంగా ఎలా ఉందంటే…

నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీకాకుళం కార్పొరేష‌న్‌, రూర‌ల్ మండ‌లంతో పాటు గార మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2.33 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇక్క‌డ వెల‌మ ఓట‌ర్లు ఎక్కువ. గుండ ల‌క్ష్మీదేవి, ఆమె ప్ర‌త్య‌ర్థి ధ‌ర్మాన ఇద్ద‌రూ ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఆ త‌ర్వాత రెండో స్థానంలో వైశ్యులు, మూడో స్థానంలో కాళింగ, నాలుగో స్థానంలో మత్స్యకారులు, ఐదో స్థానంలో శిష్ట కరణాలు వున్నారు. రాజ‌కీయంగా ఆమెకు ఉన్న ప్ల‌స్ ఆమె, ఆమె భ‌ర్త వ్య‌క్తిత్వ‌మే. ప్ర‌స్తుతం వైసీపీ నుంచి ప్ర‌త్య‌ర్థిగా ఉన్న ధ‌ర్మాన మీద గ‌తంలో లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లు రావ‌డం కూడా వీరికి ప్ల‌స్‌. అయితే ధ‌ర్మాన హ‌యాంలోనే ఇక్క‌డ అభివృద్ధి జ‌రిగింద‌న్న‌ది కూడా వాస్త‌వం.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– భార్య అప్ప‌ల‌నాయుడు, ల‌క్ష్మీదేవిల వ్య‌క్తిత్వం

– నిత్యం జ‌నాల్లో ఉండడం, ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు

మైన‌స్ పాయింట్స్ (-):

– హ‌మీలు కొండంత నెర‌వేర్చింది గోరంత‌

తుది తీర్పు:

భార్య‌భ‌ర్త‌ల వ్య‌క్తిత్వంతోనే ముందుకు వెళుతోన్న ల‌క్ష్మీదేవి అదే ప్ల‌స్‌. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి లేక‌పోవ‌డంతో ఆమెపై వ్య‌తిరేక‌త మాత్రం ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. అటు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావుకు కూడా ప్ల‌స్‌ల క‌న్నా మైన‌స్‌లే ఎక్కువుగా ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన కొన్ని యూత్ ఓట్లు చీల్చ‌డం మిన‌హా చేసేదేమి లేదు. ఓవ‌రాల్‌గా ల‌క్ష్మీ దేవి గెలుపు ఓట‌ములు అప్ప‌టి ఎన్నిక‌ల ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటాయి. ఈ యేడాదిన్న‌ర‌లో కొన్ని హామీలు అయిన నెర‌వేర్చితే ఆమెకు ప్ల‌స్ అవుతుంది.