
వైసీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు బద్ధ శత్రువు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. ఈయనకు ఉమ్మడి హైకోర్టు నుంచి స్వీట్ న్యూస్ అందింది. దీంతో నిన్న మొన్నటి వరకు తీవ్ర టెన్షన్లో కొట్టు మిట్టాడిన ఆళ్ల.. మంగళవారం ఫ్రీగా కనిపించారు. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పరిధిలోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న భూముల వేలానికి సంబంధించి ఆళ్ల న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ భూములను చంద్రబాబు ప్రభుత్వం అతి స్వల్ప ధరలకే కట్టబెట్టిందని ఆయన కోర్టుకు ఎక్కారు. అప్పటికి జరిగిన వేలం కన్నా ఐదు కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకునేందుకు తాను రెడీ అని ప్రకటించారు.
ఈ క్రమంలోనే కోర్టు తొలుత జరిగిన వేలంలో వచ్చిన మొత్తానికి రూ.5 కోట్లను అదనంగా డిపాజిట్ చేయాలని మొత్తంగా రూ.27 కోట్లను జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి రూ.27 కోట్లను ఎమ్మెల్యే ఆళ్ల జమ చేశారు. అయితే, ఈ భూములకు మరోసారి వేలం వేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో తర్వాత జరిగిన వేలంలో ఈ భూములు రూ. 50 కోట్లకు పైగా పలికాయి. వీటిని దక్కించుకున్న వారు తర్వాత మొండి చేయి చూపించారు. వివిధ కారణాలతో తమ బిడ్లను రద్దు చేసుకున్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారానికి బ్రేక్ పడింది.
ఈలోగా తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. అసలు తమ రాష్ట్ర పరిధిలోని సదరు భూములు సదావర్తి సత్రానికి చెందినవి కావని మరో పిటిషన్ దాఖలు చేసింది. ఫలితంగా ఈ భూములు ఎవరివో తేల్చేదాకా వేలం నిర్వహణ కుదరదని తేల్చేసింది. ఈ క్రమంలో తాను ఏపీ ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ.. ఆళ్ల మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న సుదీర్ఘ విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు ఆళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా ఆళ్లకు తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆళ్ల ఇప్పుడు ఖుషీగా ఉన్నారు. మొత్తానికి ఈ వివాదంలో అంత సొమ్ము ఎక్కడ లాక్ అవుతుందోనని భయపడినట్టు సమాచారం.