ఐటీ దాడులతో ‘ఓటుకునోటు’ తేలిపోనుందా?

October 12, 2018 at 2:51 pm

ఐటీ దాడులు అనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే.. గత కొన్ని రోజులుగా.. చాలా ముమ్మరంగా జరుగుతున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసాలు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లమీద ఐటీ దాడులతో రచ్చ మొదలైంది. తర్వాత వేదిక అమరావతికి మారింది. ఇప్పుడు తెదేపా ఎంపీ సీఎం రమేష్ కు చెందిన అన్ని చోట్ల ఐటీదాడులు శుక్రవారం నాడు జరుగుతున్నాయి. అయితే.. ఇంత ముమ్మరంగా ఒకరితో ఒకరికి ముడి ఉన్న వారి మీదనే వరుసగా ఐటీదాడుల వెనుక ఆంతర్యం ఏమిటి? అంటే, ఈ దాడులతో ఓటుకు నోటు కేసు విషయంలో జరిగిన అక్రమాలు తేలిపోతాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

income-tax

రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు మొదలు కాగానే మీడియా అంతా రకరకాల కథనాలు, వార్తలు వచ్చాయి. ఆయన వ్యాపారాలు, ఆర్థిక అరాచకత్వాల మీద దాడులు అంటూ వర్ణించారు. తీరా.. రేవంత్ రెడ్డి స్వయంగా వారి విచారణకు కూడా హాజరైన తర్వాత.. అంతా తేలిపోయింది. ఐటీ దాడులు ఆయన మొత్తం వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలమీద కాదని, ఓటుకు నోటు కేసు సమయంలో పోలీసులకు దొరికిన యాభై లక్షల రూపాయల గురించి మాత్రమే అడిగారని, ఆ డబ్బు గురించి అప్పట్లోనే చెప్పామని.. అదే సంగతి ఇప్పుడు కూడా చెప్పాం అని రేవంత్ మీడియాతో అన్నారు. ఆ తర్వాత వీటి కొనసాగింపు దాడులు విజయవాడ, గుంటూరుల్లో కూడా జరిగాయి. రేవంత్ విచారణలో చెప్పిన సమాచారం మేరకు ఆ దాడులు జరుగుతున్నాయేమో అని అంతా అనుకున్నారు.

తీరా శుక్రవారం నాడు తెదేపాలో తెరవెనుక చక్రం తిప్పే వారిలో కీలక నేత అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇంతకూ విషయం ఏంటంటే.. అప్పట్లో స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు సీఎం రమేష్ సమకూర్చారు అనే పుకార్లు వచ్చాయి. ఆ విషయం నిర్ధరించుకోవడానికే.. ఇప్పుడు ఐటీ అధికారులు ఆయన మీద కూడా దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఐటీదాడులు జరుగుతున్న వరసను గమనిస్తే.. మొత్తానికి ఓటుకు నోటు కేసును చాలా పక్కాగా ఒక కొలిక్కి తీసుకువచ్చి తేల్చేయడానికి అధికారులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నట్లు అనిపిస్తోంది. ఓటుకు నోటు నిందితులకు పక్కాగా శిక్ష పడి తీరుతుందని కూడా అనుకుంటున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకుల, అభిమానుల ఆందోళన కూడా అదే. అదే జరిగితే.. చంద్రబాబునాయుడుకు కూడా చిక్కులు తప్పకపోవచ్చు.

ఐటీ దాడులతో ‘ఓటుకునోటు’ తేలిపోనుందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share