జనసేనలోకి కొత్త రక్తం ఇదే!

July 4, 2018 at 10:08 am
Janasena, Pawan kalyan, Politics, New Blood, Seniors entry

`కొత్త సీసాలో పాత నీరు` సామెత గుర్తొస్తోంది జ‌న‌సేనలో చేరుతున్న నాయ‌కుల‌ను గ‌మ‌నిస్తూ ఉంటే! కొత్త త‌రం రాజ‌కీయాల‌కు వేదిక‌గా నిలుస్తాన‌ని ప్ర‌క‌టించాడు.. రాజ‌కీయాల్లో కొత్త ర‌క్తం తీసుకొస్తాన‌ని వాగ్ధానాలు, హామీలు ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మ‌రి అవ‌న్నీ నీటి మీద రాత‌లే అయిపోయాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ `కొత్త` మాట‌లు ఇంకా చెవుల్లో వినిపిస్తూ ఉండ‌గానే.. `పాత` నాయ‌కులంతా ఆ పార్టీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. నాయ‌కులు వ‌చ్చి చేరుతున్నారు స‌రే.. మ‌రి కొత్త ర‌క్తం మాటేమిటి ప‌వ‌న్ అంటూ కొంద‌రు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం జ‌న‌సేన‌లోకి చేరిక‌లు మొద‌ల‌య్యాయి. ఇన్నాళ్లూ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్ర‌య‌త్నిస్తూ.. రాజ‌కీయాలు గమనిస్తూ వ‌స్తున్న నేత‌లు ఇక ప‌వ‌న్ చెంత‌కు చేరుతున్నారు. అంతేగాక మ‌రికొంత‌మందికి ఆహ్వానాలు కూడా వెళుతున్నాయి. మ‌రి కొత్త ర‌క్త‌మంటే ఇదేనా ప‌వ‌న్ అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున యువ‌త బ‌రిలోకి దిగుతారు అంటూ జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ గ‌తంలో ప్ర‌క‌టించారు. దాదాపు ఆరు నెల‌ల‌ కింద‌ట ప‌వ‌న్ మ‌రో ప్ర‌క‌ట‌న కూడా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 60 శాతం టిక్కెట్లు కొత్త‌వారికి ఇస్తామ‌ని చెప్పారు. తాజాగా ప‌వన్ చేస్తున్న బ‌స్సుయాత్ర‌ల్లో కూడా చెబుతున్న మాట‌.. కొత్త రాజ‌కీయాలు చేస్తామ‌నీ, ఒక‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని కూడా అన్నారు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా పార్టీలో చేరుతున్న, చేర్చుకుంటున్న నేత‌లను చూస్తుంటే ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌ల‌కు వాస్త‌వానికీ పొంత‌న లేకుండా ఉందనే చ‌ర్చ మొద‌లైంది. తొలివిడత పవన్ యాత్రలో నేతల చేరికపై పెద్దగా దృష్టిపెట్లేదు. కానీ, ఇప్పుడు వ‌రుస‌గా నేత‌ల్ని చేర్చుకుంటున్నారు.

విశాఖ నుంచి టీడీపీలో అవ‌కాశం కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేసిన కోన తాతారావు జ‌న‌సేన‌లో చేరారు. అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింత‌ల‌పూడి వెంకట్రామ‌య్య‌, మాజీ కాంగ్రెస్ నేత‌ స‌తీష్ కూడా జ‌న‌సేన గూటికి చేరిపోయారు. వీరితోపాటు సీనియ‌ర్ నేత దాడి వీర‌భ‌ద్ర‌రావుని కూడా జ‌న‌సేన‌లోకి ఆహ్వానించే అవ‌కాశం ఉంద‌ట‌. వైసీపీ నుంచి దూర‌మ‌య్యాక ఆయ‌న త‌ట‌స్థంగా ఉంటున్నారు. చోడ‌వ‌రం నుంచి మ‌రో మాజీ వైసీపీ నేత‌ల వి.వి.ఎస్‌.ఎన్‌. రాజు కూడా చేర‌బోతున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి, ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న ముగిసే లోపు చేరిక‌ల జోరు ప‌వ‌న్ పెంచుతున్నా రు. ఇప్పుడు చేర్చుకున్న‌వారంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున టిక్కెట్లు ఇస్తారా ఇవ్వరా అనేది ప్ర‌స్తుతానికి చ‌ర్చ కాక‌పోయినా.. వీరిలో సీనియ‌ర్లు.. టికెట్లు ఆశించే క‌దా చేరేది!

కొత్త త‌రానికే పార్టీలో ప్రాధాన్య‌త అని చెబుతూ ఇలా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ, పార్టీలు మారుస్తూ వ‌స్తున్న నేత‌ల‌ను ఏరికోరి చేర్చుకోవ‌డం వ‌ల్ల జ‌న‌సేన‌కు `కొత్త త‌ర‌హా రాజ‌కీయం` అనే బ్రాండ్ ఇమేజ్ ఎలా వ‌స్తుంద‌నేది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌? అనుభవం ఉన్న నేతలూ అవసరమే. కానీ, కొత్తతరం నేతల్ని కూడా వీరితోపాటు చేర్చుకుంటూ పోతే ఇమేజ్ ఇంకోలా కనిపిస్తుందని హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌కు ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కావాలి. సో ప‌వ‌న్‌.. ఇత‌ర రంగాల‌పై కూడా దృష్టి పెట్టి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ, వివిధ మార్గాల ద్వారా ప్ర‌జాసేవ చేస్తున్న‌వారికి గుర్తించి ఆహ్వానించాల‌ని సూచిస్తున్నారు. అప్పుడే కొత్త రాజ‌కీయాల‌కు వేదికగా జ‌న‌సేన మారుతుంద‌ని.. లేనిప‌క్షంలో ఇదంతా హ‌డావుడిగానే క‌నిపిస్తుంద‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు. చేరిక‌ల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కాస్త తొంద‌ర ప‌డుతున్నాడేమో అనే సందేహాలు కూడా వ్య‌క్తంచేస్తున్నారు.

జనసేనలోకి కొత్త రక్తం ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share