లక్ష్మీనారాయణకు ఆ ధైర్యముందా?

October 7, 2018 at 9:14 am

వీవీ లక్ష్మీనారాయణ.. ఆయన ఒక మాజీ పోలీసు అధికారి మాత్రమే. కానీ, ఆయనకు ఏ ఇతర రాజకీయ నాయకులు, సినిమా స్టార్లతో సమానమైన క్రేజ్ ఉంది. వైఎస్ జగన్మోహన రెడ్డి మీద కేసులను విచారించిన సీబీఐ అధికారిగా ఆయనకు రెండు తెలుగురాష్ట్రాలోనూ గుర్తింపు ఉంది. కొన్నాళ్ల కిందట ఆయన తన పదవికి రాజీనామా చేసేసి.. ప్రజల్లో తిరుగుతున్నారు. తన ఎన్జీవో ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ముగిస్తూ ఆయన తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. తన రాజకీయ అభిలాష గురించి వెల్లడించారు.

JD-Laxminarayana1538881072

తన ఆలోచనలతో జత కలిసే రాజకీయ పార్టీలో చేరుతానని ఆయన వెల్లడిస్తున్నారు. మంచి పోలీసు అధికారిగా లక్ష్మీనారాయణకు గుర్తింపు ఉంది. ఆ క్రేజ్ ను ఆయన రాజకీయ ఆగమానినికి లాంచింగ్ ప్లాట్ ఫాంలాగా వాడుకోవాలని చూస్తున్నారన్నది స్పష్టం. జీరో బడ్జెట్ రాజకీయాలే తన లక్ష్యం అని, తాను ఎన్నికల్లో ఓట్లకోసం డబ్బులివ్వనని, ఈసీ చెప్పినంత ఖర్చు మాత్రమే పెడతానని ఇలా సుద్దులు చెబుతున్నారు. వాటికి తగిన పార్టీలోనే చేరుతానని అంటున్నారు.

అయితే జేడీ లక్ష్మీనారాయణ తానొక్కడూ పరిశుద్ధంగా ఉంటానంటే సరిపోదు కదా. ఆయన చేరదలచుకుంటున్న పార్టీ కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. నేను ఓట్లకు డబ్బులివ్వను అంటే సరిపోదు. జీరో బడ్జెట్ రాజకీయం నిజంగానే ఆయన లక్ష్యమైతే గనుక.. ఓట్లకు డబ్బులిచ్చే అలవాటు లేని పార్టీలోనే ఆయన చేరాల్సి ఉంటుంది. తాను నిజాయితీగా ఉంటున్నానని చెప్పుకుంటూ.. ప్రజలను ఓట్లను కొనుక్కుని గద్దె ఎక్కే పార్టీల్లో చేరితే.. అలాంటి అవినీతి ప్రభుత్వాల ద్వారా లక్ష్మీనారాయణ సమాజానికి ఎలాంటి మంచి చేయగలరు? వంటి అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

సూటిగా చెప్పాలంటే.. తాను నిజాయితీగా ఉంటానని , ఓట్లకు డబ్బులివ్వనని ప్రకటించడం మాత్రమే హీరోయిజం కాదు అని మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుసుకోవాలి. ఓట్లకు డబ్బులిచ్చే ఏ పార్టీలోనూ తాను చేరను అని ఆయన స్పష్టంగా చెప్పాలి. లేకపోతే.. ఆయన ప్రకటన మొత్తం సరికొత్త నాటకమే అవుతుంది తప్ప మరో ప్రయోజనం లేదు. ధనమయం అయిన పార్టీలకు తాను దూరంగా ఉంటానని చెబితేనే.. లక్ష్మీనారాయణను ప్రజలు నమ్మగలరు. లేకుంటే.. ప్రకటనలకు పరిమితమై.. ఆయన కొన్నాళ్లకు మొహం చాటేయాల్సి వస్తుంది.

లక్ష్మీనారాయణకు ఆ ధైర్యముందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share