క‌న్న‌డ ఎన్నిక‌ల ముంగిట బీజేపీకి బిగ్ షాక్‌

May 5, 2018 at 11:02 am
Karnataka Elections, BJP, gali ganardhanreddy, high court

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముంగిట అధికారం కోసం నానా ఇక్క‌ట్లు ప‌డుతోన్న బీజేపీకి దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, వివాస్ప‌ద నేత గాలి జ‌నార్ద‌న్‌రెడ్డికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బ‌ళ్లారిలో ప్ర‌చారం చేయ‌డానికి వీల్లేందంటూ తేల్చి చెప్పింది. అక్ర‌మ మైనింగ్ త‌వ్వ‌కాలు జ‌రిపిన కేసులో బెయిల్‌పై బ‌య‌ట ఉన్న గాలి బ‌ళ్లారిలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించేందుకు నిరాక‌రించింది. ప్ర‌చారం చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌నే ఆయ‌న పిటిష‌న్‌ను శుక్ర‌వారం కొట్టివేసింది. ఈ పిటిష‌న్‌ను విచారించేందుకు ఎలాంటి అర్హ‌త లేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తోసిపుచ్చింది. 

 

బీజేపీతో గాలిజ‌నార్ద‌న్‌రెడ్డికి ఎటువంటి సంబంధాలూ లేవ‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ప్ర‌క‌టించినా.. త‌న‌వ‌ర్గానికి టికెట్లు ద‌క్కించుకున్నాడు గాలి. ప్ర‌స్తుతం ఇత‌ర ప్రాంతాల్లో బీజేపీ నేత‌ల‌తో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేస్తున్నారు. అయితే బ‌ళ్లారిలో ఏరియాలో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ప్ర‌చారం చేయ‌కుంటే.. బీజేపీకి తీవ్ర న‌ష్ట‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. బళ్లారి సిటీ నియోజకవర్గంలో గాలి జనార్థ‌న్‌ సోదరుడు  సోమశేఖర రెడ్డి, హ‌ర‌ప్ప‌న‌హ‌ళ్లిలో  మ‌రో సోద‌రుడు క‌రుణాక‌ర్‌రెడ్డి బీజేపీ త‌రుపున బ‌రిలో ఉన్నారు. ఇక బ‌ళ్లారితో పాటు స‌మీప జిల్లాల్లో మొత్తం గాలి గ్యాంగ్ ఓ 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తోంది. మొత్తంగా బ‌ళ్లారి చుట్టుప‌క్క‌ల జిల్లాలో 27 సీట్ల వ‌ర‌కు గాలి గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా.

 

వీరి తరపున బళ్లారిలో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాలి జనార్దన్‌ సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెయిల్‌ నిబంధనలను సడలిస్తూ 10 రోజులు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు దానిని తిరస్కరించింది. మైనింగ్‌ కేసులో గాలికి సుప్రీంకోర్టు షరతులతో కూడా బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ ష‌ర‌తుల మేర‌కు బళ్లారి ప్రాంతానికి వెళ్లకూడదని ఇదివ‌ర‌కే సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో ఆయ‌న చిత్ర‌దుర్గ జిల్లా మొల‌క‌ల్మూరులో ఉంటున్నారు. ఈ నిషేధాజ్ఞల నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం అందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. 

 

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి విష‌యంలో బీజేపీ క‌క్క‌లేక‌మింగ‌లేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఎన్నిక‌ల్లో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిని దూరంగా ఉంచితేనే పార్టీకి న‌ష్టం ఉండ‌ద‌న్న ఉద్దేశంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న అమిత్‌షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గాలికి బీజేపీతో ఎలాంటి సంబంధాలూ లేవ‌ని ప్ర‌క‌టించారు. కానీ, బ‌ళ్లారి, త‌దిత‌ర ప్రాంతాల్లోని సుమారు 27నియోజ‌క‌వ‌ర్గాల్లో గాలి సోద‌రులు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. అమిత్‌షా ప్ర‌క‌ట‌న‌తో ఒకానొక‌ద‌శ‌లో గాలి రెబ‌ల్‌గానైనా వ‌ర్గాన్ని రంగంలోకి దించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈక్ర‌మంలోనే బీజేపీ విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల జాబితాలో గాలి వ‌ర్గానికి చెందిన ప‌దిమంది పేర్లు ఉండ‌డంతో అంద‌రూ కంగుతిన్నారు.  

క‌న్న‌డ ఎన్నిక‌ల ముంగిట బీజేపీకి బిగ్ షాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share