కర్ణాటక నాట ప‌ని చేయ‌ని కాంగ్రెస్ లింగాయ‌తాస్త్రం

May 15, 2018 at 11:40 am
karnataka Elections, Sidharamayya, congress, rahul, failures

ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న‌ క‌ర్ణాట‌క ఫ‌లితాలపై మ‌రికొద్ది సేప‌ట్లో ఒక స్పష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. క‌న్న‌డ‌నాట కాషాయ జెండా ఎగ‌రేయాల‌ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యూహాలు ఫ‌లిస్తున్నాయ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ముందునుంచి విజ‌యం త‌మ‌దేనంటూ చెప్పిన కాంగ్రెస్ అధినేత‌లు సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా కుల రాజ‌కీయాలు ఈ ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముందునుంచి లింగాయ‌త్‌ల‌పైనే కాంగ్రెస్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. బీజేపీ జాతీయ వాదంపై ఎన్నో విమ‌ర్శ‌లు చేశారు. హిందుత్వ‌వాదాన్ని విప‌రీతంగా ప్ర‌చారంచేశారు. 

 

అయితే ఇది ఏమాత్రం ఫ‌లించ‌లేద‌ని తేలిపోయింది. లింగాయత్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యూహాలు దెబ్బ‌తిన్నాయి. సిద్ధ రామ‌య్య ఎన్ని వ్యూహాలు ర‌చించినా.. అవి ఓట్లు మాత్రం రాల్చలేక‌పోయాయి. హోరాహోరీగా కాంగ్రెస్‌, బీజేపీ చేసిన ప్రచారంలో చివ‌ర‌కు బీజేపీ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపారు. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నా.. ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. ముఖ్యంగా క‌న్న‌డ‌నాట తీవ్ర ప్ర‌భావం చూపే లింగాయ‌త్‌ల‌ను ఆక‌ర్షించేందుకు ఇరు పార్టీల నేత‌లు ఎన్నో వ్యూహాలు ర‌చించారు. ముఖ్యంగా బీజేపీ హిందుత్వ వాదంపై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. 

 

ప్ర‌చార స‌భ‌ల్లో ప్ర‌ధాని మోదీ.. కులాలు, వ‌ర్గాల వారీగా.. హిందూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్ధా రామ‌య్య‌పై సెక్యుల‌ర్ అస్త్రాన్ని ప్ర‌యోగించారు. సిద్ధ‌రామ‌య్య ముస్లిం అభిమాని అంటూ ప్ర‌చారం చేశారు బీజేపీ నాయ‌కులు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏలుబ‌డిలో హిందూ మ‌తం ప్ర‌మాదంలో ప‌డిపోయిందనే నినాదాన్ని విప‌రీతంగా ప్ర‌చారం చేసింది. లింగాయతుల ఆధిపత్యం బొంబాయి కర్ణాటక ఎక్కువ‌. ఈ ప్రాంతం బీజేపీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు సొంత కుంపటి పెట్టుకోవడంతో నష్టపోయింది. 

 

మొత్తం 50 స్థానాలున్న ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 31 స్థానాలు సాధించగా బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్లింది. లింగాయ‌తుల‌కు మైనారిటీ మ‌తం గుర్తింపు ఇస్తామ‌ని కాంగ్రెస్‌ ప్ర‌క‌టించింది. లింగాయత్‌లకు మైనారిటీ మతం గుర్తింపు ఇస్తాననడం వల్ల వారు కాంగ్రెస్‌కు దగ్గరయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వాస్తవంగా గుర్తింపునిచ్చేది కేంద్రమే కనుక వారు తమకే ఓటేస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

 

దీనికి కాంగ్రెస్ కూడా ధీటుగానే బ‌దులిచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఎత్తుకు పైఎత్తులు వేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన‌ సిద్ధరామయ్య తను హిందువునే కానీ, సెక్యులరిస్టు హిందువునని చెప్పుకుని బీజేపీని నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నించారు. బీజేపీ జాతీయతావాదాన్ని రెచ్చగొడితే ఉపజాతీయతా వాదాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. కన్నడ భాష గురించి అక్కడ ముందు నుంచి చాలా ఎవేర్‌నెస్‌ ఉంది. అందుకని యీసారి ఏకంగా కన్నడ జెండా అనేశాడు. గుజరాత్‌ ఆత్మగౌరవాన్ని భుజాన కెత్తుకుని మోదీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడితే.. అదే కాపీ కొట్టి  కన్న‌డ‌నాట‌ సిద్ధరామయ్య కన్నడతనం గురించి మాట్లాడుతున్నాడు. 15 వ ఆర్థిక సంఘం సిఫార్సులు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయనే సంగతి కూడా బాగా చర్చకు వచ్చింది. ఇవ‌న్నీ చేసినా బీజేపీకి స్ప‌ష్ట‌మైన‌ ఆధిక్యం ల‌భించింది. 

 

కర్ణాటక నాట ప‌ని చేయ‌ని కాంగ్రెస్ లింగాయ‌తాస్త్రం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share