సిద్దుకు షాక్…ఎమ్మెల్యేలు జంప్

May 16, 2018 at 1:15 pm
karnataka, sidharamayya, congress party, MLA missing

హంగ్ ఏర్ప‌డిన నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లో ఎవ‌రు అధికారాన్ని చేజిక్కించుకుంటార‌నే అంశంపై ఎడ‌తెగ‌ని, ఆస‌క్తిక‌ర‌మైన‌ చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయాలు ఎప్పుడు ఎటువైపు మొగ్గు చూపుతాయోననే ఉత్కంఠ అంద‌రిలోనూ పెరుగుతోంది. ఎక్కువ సీట్లు సాధించినా అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయిన బీజేపీ.. ఆ పార్టీకి అధికారం ద‌క్కకుండా జేడీఎస్‌కు సీఎం ప‌ద‌వి ఇచ్చి, మ‌ద్ద‌తు తెలుపుతున్న కాంగ్రెస్ మ‌ధ్య రాజ‌కీయ చ‌ద‌రంగం మొద‌లైంది. జేడీఎస్ మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఫ‌లితాల అనంత‌రం నిర్వ‌హించిన స‌మావేశానికి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్ట‌డం ఇప్పుడు అనూహ్య ప‌రిణామాల‌కు తావిస్తోంది. ఆ 12 మంది ఏమైన‌ట్లు? ఎవ‌రితో ట‌చ్‌లో ఉన్న‌ట్లు అనే ప్ర‌శ్న‌లు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి.  వీరితో పాటు మ‌రో ఇద్ద‌రు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా గ‌ల్లంతు అవ్వ‌డం రాజ‌కీయాలను మ‌రింత హీటెక్కిస్తోంది. 

 

క‌ర్ణాట‌క‌లో ఆస‌క్తిక‌ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన 24 గంట‌ల్లోనే ఊహించ‌ని విధంగా ఆ పార్టీకి ఝ‌లక్ ఇచ్చారు ఎమ్మెల్యేలు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు వారం రోజులు గ‌డువు అడిగిన య‌డ్యూర‌ప్ప క్యాంప్ కూడా శ‌ర‌వేగంగా పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ శిబిరంలో అల‌జ‌డి మొద‌లైంది. జేడీఎస్‌కు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నేడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. అయితే 78 మందికి గాను 66 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయినట్లు తెలిసింది. దీంతో మిగిలిన ఆ 12మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారనే అంశం ఆసక్తికరంగా మారింది. వీరిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమైనట్లు తెలిసింది. 

 

ఈ సమావేశానికి హైదరాబాద్‌ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్‌, నాగేంద్ర, రాజశేఖర పాటిల్‌ గైర్హాజరయ్యారు. వీరు కనీసం అధిష్టానంతో టచ్‌లో కూడా లేకపోవడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆనందసింగ్‌, నాగేంద్ర గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు సన్నిహితులు అని తెలుస్తోంది. బీజేపీ నేత శ్రీరాములుకు వీరు బంధువులు కావడంతో.. ఆయన దగ్గరు ఈ ఇద్దరు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఐదుగురు లింగాయత్‌ ఎమ్మెల్యేలు బీజేపీ నేత యడ్యూరప్పతో రహస్యంగా మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతుండటం పార్టీని ఆందోళన పరుస్తోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

 

బీజేపీ వైపు తమ ఎమ్మెల్యేలు ఆకర్షితం కాకుండా కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. బెంగళూరులోని ఈగల్టన్‌ హోటల్లో 150 గదులు బుక్‌ చేసి.. తమ ఎమ్మెల్యేలను అక్కడికి తరలించాలని భావిస్తోంది. ఈ పరిణామంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ వీరిని వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. కనిపించకుండాపోయిన నలుగురు ఎమ్మెల్యేల కోసం హెలికాఫ్టర్‌తో బీదర్, కలబురిగి ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, అనైతిక చర్యల ద్వారా ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ అధిష్టాన దూత గులాంనబీ ఆజాద్‌ మండిపడ్డారు. 

 

సిద్దుకు షాక్…ఎమ్మెల్యేలు జంప్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share