సురేఖ‌కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. అందుకేనా..?

July 9, 2018 at 9:33 am
KCR, Telangana, CM, Konda Surekha, Speaker Madhusudhanrao, MLA seat

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎవ‌రైనా న‌చ్చితే నెత్తిన పెట్టుకుంటారు. లేక‌పోతే వారిని త‌న వ‌ద్ద‌కు రానివ్వరు. మ‌రి ఆయ‌న చ‌నువిస్తున్నారు క‌దా అని ఇంకా ఇంకా ఆయ‌న త‌ల‌కెక్కేందుకు ప్ర‌యత్నిస్తే.. ఆయ‌న ఆగ్ర‌హానికి గుర‌వ్వ‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం కొండా దంప‌తుల తీరు కూడా ఇలానే ఉంద‌ని చెబుతున్నారు టీఆర్ఎస్ నాయ‌కులు. కాంగ్రెస్ నుంచి కారెక్కేసిన వీరికి పార్టీలో స‌ముచిత స్థాన‌మే క‌ల్పించారు కేసీఆర్‌. అయినా ఇంకా వీరి ఆశ‌లు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ట‌. ఇవి విన్న కేసీఆర్.. ఒక్క‌సారిగా అవాక్క‌య్యార‌ట. త‌మ‌ కుటుంబానికి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల‌ని కోర‌డంతో గులాబీ ద‌ళ‌ప‌తి ఖంగుతిన్నార‌ట‌. హుటాహుటిన ఆమెను పిలిపించుకుని స్ట్రాంగ్ క్లాస్ పీకార‌ని తెలుస్తోంది. అంతేగాక ఇత‌రుల అసెంబ్లీ సీట్ల‌కు ఎస‌రు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించార‌ట‌.

తెలంగాణ‌లో కొండా సురేఖ వ్య‌వ‌హార‌శైలి ఇప్పుడు టీఆర్ఎస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి త‌మ‌తో పాటు వార‌సుల‌ను కూడా తీసుకొచ్చేందుకు నేతలు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే! ఈ నేప‌థ్యంలో ఆమె కూడా త‌మ కూతురిని కూడా బ‌రిలో నిల‌బెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆమె పుట్టి పెరిగింది కాంగ్రెసులోనే. 2004, 2009 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసింది. వైఎస్‌ జగన్‌ను కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి కానివ్వకపోవడంతో కోపం తెచ్చుకొని రాజీనామా చేసింది. ఆ తర్వాత వైసీపీలో చేరి, 2012లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున గెలిచారు. జగన్‌ తమను అవమానపరిచాడని ఆగ్రహించి, భర్తతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ప్ర‌స్తుతం 2019 ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న స‌మ‌యంలో ఆమె అస‌లైన టీఆర్ఎస్ నేత‌ల‌కు ఝ‌ల‌క్ ఇస్తున‌నార‌ట‌.

సురేఖ భ‌ర్త కొండా మురళీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్‌ మహిళా మంత్రిని నియమించాలనుకుంటే సురేఖకు అవకాశం ఉంటుందనుకున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆమె స్పీకర్‌ మధుసూదనాచారి నియోజకవర్గమైన భూపాలపల్లి మీద కన్నేశార‌ట‌. అక్కడి నుంచి తన కూతురును పోటీ చేయించాలని ఆమె భావిస్తున్నార‌ట‌. పరకాల, భూపాలపల్లికి ఒరిజినల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ రెండింటిలో ఒకచోటి నుంచి తన కూతురును ఎమ్మెల్యేగా చేస్తానని సురేఖ బహిరంగంగా ప్ర‌క‌టించ‌డంతో టీఆర్ఎస్‌లో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయ‌ట‌.

స్పీకర్‌ మధుసూదనాచారి సీఎంకు అత్యంత ఆప్తుడు. ఆయన సీటుకు ఎసరు పెట్టాలనుకుంటే కేసీఆర్‌ ఊరుకుంటారా? ఆమె వ్యవహారమంతా కేసీఆర్‌ చెవిన పడ‌టంతో పిలిపించి క్లాసు తీసుకున్నార‌ట‌. `అసలే నువ్వు జంప్‌జిలానీవి. అయినప్పటికీ ప్రాధాన్యం ఇచ్చానని, ఇంకా లేనిపోని ఆశలేమిట`ని క్లాస్‌ పీకారట. కాంగ్రెసులో టిక్కెట్టు రాకుండా ఉన్న పరిస్థితిలో టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని ఆదరిస్తే పార్టీకే నష్టం కలిగిస్తారా? అంటూ గ‌ట్టిగానే మంద‌లించార‌ట‌.

సురేఖ‌కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share