ఆ భయంతోనే గులాబీ బాస్ ముందస్తు పట్టు!

August 11, 2018 at 12:59 pm

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు కోసం ప‌ట్టుబ‌డుతున్నారా..? క‌లివిడిగా కంటే.. విడిగా బ‌రిలోకి దిగితేనే విజ‌యం సుల‌భ‌మ‌వుతుంద‌ని గులాబీ బాస్ భావిస్తున్నారా..? ఇందుకు ప్ర‌ధాని మోడీ స‌హ‌కారం కోరుతున్నారా..? అందుకే ఢిల్లీ చుట్టు చ‌క్క‌ర్లు కొడుతున్నారా..? అంటే ఢిల్లీలోని రాజ‌కీయ‌వ‌ర్గాలు ఔననే అంటున్నాయి. నెల నెల‌ప‌దిహేను రోజుల్లోనే సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడీతో భేటీ కావ‌డంలో ఆంత‌ర్యం ఇదేన‌ని చెబుతున్నాయి. లోక్‌స‌భ‌తోపాటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం టీఆర్ఎస్‌కు అంత మంచిదికాద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఇందుకు బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి. ఇందులో మూడు నాలుగు కోణాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయ‌మ‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

CM-K-Chandrashekhar-Rao-n-e1521305215834

ఆ మూడునాలుగు కోణాల్లో ప్ర‌ధాన‌మైన‌ది.. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కుదురుకోలేదు. రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఇంకా క్యాడ‌ర్‌పై ప‌ట్టుసాధించ‌లేదు. ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర విజ‌య‌వంత‌మైనా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేంత బ‌లం మాత్రం సాధించ‌లేదు. నేత‌ల మ‌ధ్య గ్యాప్ అలాగే ఉంది. ఈ మ‌ధ్య గ్యాప్ త‌గ్గి గెలువాల‌న్న ప‌ట్టుద‌ల‌తో నేత‌లంద‌రూ క‌లిసిన‌డిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. ఇక ఇదే స‌మ‌యంలో గులాబీ గూటిలోనూ లుక‌లుక‌లు ఇప్పుడిప్పుడే మొద‌ల‌య్యాయి. కారు ఫుల్ లోడుతో క‌ద‌ల‌లేని స్థితిలో ఉంది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ రేసులో ముగ్గురు న‌లుగురు ఉన్నారు.అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వారిలో ఎక్కువ‌గా ప్ర‌త్య‌ర్థులే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఒకరికి టికెట్ వస్తే మరొకరు కీడు చేసే ప్రమాదం ఉంది.

ఇటీవ‌ల బీజేపీకి టీఆర్ఎస్ ద‌గ్గ‌ర‌వుతుంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతోంది. దీంతో ముస్లింలు కూడా టీఆర్ఎస్ అంటే ఆలోచించే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి జ‌ర‌గ‌డం వ‌ల్ల మ‌జ్లిస్ స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే. ఆ పార్టీ కాంగ్రెస్‌తో క‌లిసి న‌డిచే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. దీంతో ముంద‌స్తుగా అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తే.. మ‌జ్లిస్ స‌హ‌కారం పొంద‌వ‌చ్చున‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముందు జ‌రిగితే.. తాము కూడా మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని మ‌జ్లిస్ నేత‌లు సంకేతాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ సీఎం కేసీఆర్ వైఖ‌రిపై గ్రేట‌ర్‌లోని ఆంధ్రులు కొంత గుర్రుగా ఉన్నారు. రోజులు గ‌డిస్తే మ‌రింత ఎక్కువ‌య్యే అకాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ముంద‌స్తుకు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

KCR_facebook_CMO

ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిల‌కు స‌హ‌క‌రించాల‌ని, ఆ త‌ర్వాత వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తాము కూడా స‌హ‌క‌రిస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడీకి హామీ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఏడు మండ‌లాలు ఏపీలో క‌లిసి విష‌యం తెలిసిందే. దీంతో ఈ మండ‌లాలు ఉన్న మూడు నియోజ‌క‌వ‌ర్గాల హ‌ద్దుల‌ను కూడా తొంద‌ర‌గా నిర్ణ‌యించాల‌ని కేసీఆర్ కోర‌డంలో ఆంత‌ర్యం కూడా ఇదేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందుకే ముందుస్తుకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి అడ్డంకులు ఎదురుకాకుండా కేసీఆర్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌లో జ‌రిగే రాజ‌స్తాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మిటోరం రాష్ట్రాల‌తోపాటు తెలంగాణ‌లోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఇందుకు అక్టోబ‌ర్‌లోనే సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ భయంతోనే గులాబీ బాస్ ముందస్తు పట్టు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share