ఫెడ‌ర‌ల్ ఎఫెక్ట్… ఆ ఐదుగురు మంత్రులు ఎంపీలుగానే

May 7, 2018 at 12:47 pm
KCR, Telangana, Federal Front, MP, Ministers,

జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలకు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నం చేస్తున్న సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఐదుగురు మంత్రుల‌ను ఎంపీలుగా బ‌రిలో దించే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. బ‌ల‌మైన నేత‌ల‌ను త‌న‌తోపాటు తీసుకెళ్లే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం. అంతేగాకుండా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో ఈ ఐదుగురు నేత‌లకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలోనే ఫ్రంట్ కార్యాల‌యం ఏర్పాటు చేసి, ఇక నుంచి అక్క‌డి నుంచే కార్యక‌లాపాలు, వివిధ నేత‌ల్ని క‌ల‌వ‌డం.. ఇక్క‌డే స‌మావేశాలు నిర్వ‌హించేలా కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. 

 

తెలంగాణ‌లో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాల్లో విజ‌యం సాధించి, ఫ్రంట్ ఏర్పాటుకు మార్గం సుగ‌మం చేసుకోవాల‌ని కేసీఆర్ ఇప్ప‌టి నుంచి వ్యూహ‌రచ‌న చేస్తున్నారు. బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌తో ఫ్రంట్ చేయ‌డంతో పాటు దానికి నాయ‌క‌త్వం బాధ్య‌త‌లు కూడా తానే చేప‌ట్టేలా పావులు క‌దుపుతున్నారు. అయితే ఒక్క హైద‌రాబాద్ ఎంపీ స్థానంలో త‌ప్ప మిగ‌తా ప‌ద‌హారు స్థానాల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో గులాబీ బాస్ ఉన్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ త‌న టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఐదుగురు మంత్రుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీలుగా బ‌రిలోకి దించాల‌నే ఆలోచ‌న‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించ‌డం, ఇటు తెలంగాణ‌లో పార్టీ ప‌గ్గాల‌తో పాటు త‌న వార‌సుడిగా సీఎం పీఠాన్ని కూడా కేటీఆర్‌కు అప్ప‌గించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోన్న కేసీఆర్ మంత్రుల‌ను ఎంపీలుగా పోటీ చేయించే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌హీరాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి మంత్రి హ‌రీశ్‌రావును, క‌రీంన‌గ‌ర్ నుంచి మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ను, వ‌రంగ‌ల్ నుంచి ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రిని, సికింద్రాబాద్ నుంచి మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌ను, చేవెళ్ల నుంచి మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డిని, ఖ‌మ్మం నుంచి మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును పోటీ చేయిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 

ఇక మెద‌క్ నుంచి సీఎం కేసీఆర్ బ‌రిలో ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. అయితే మంత్రులు ఎంపీలుగా పోటీ చేస్తే.. వారి స్థానాల్లో ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌నే కొత్త చ‌ర్చ టీఆర్ఎస్ వ‌ర్గాల్లో మొద‌లైంది. ఆ స్థానాల్లో టికెట్ల కోసం ఇప్ప‌టి నుంచే ప‌లువురు ఆశావ‌హులు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు పార్టీవ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే మంత్రుల‌ను ఎంపీలుగా పోటీ చేయించే ఆలోచ‌న వెన‌క చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. కేటీఆర్ ప‌గ్గాలు చేప‌డితే సీనియ‌ర్ల‌తో ఇబ్బంది లేకుండా వారు రాష్ట్ర రాజ‌కీయాల్లో లేకుండా ఉండేందుకు మంత్రుల‌ను ఎంపీలుగా పంపించ‌డం కూడా కేసీఆర్ వేసిన ఓ ప్లాన్‌గా కూడా కొంద‌రు చెపుతున్నారు. మ‌రి అస‌లు విష‌యం ఏంటో కేసీఆర్‌కే ఎరుక‌..!

 

ఫెడ‌ర‌ల్ ఎఫెక్ట్… ఆ ఐదుగురు మంత్రులు ఎంపీలుగానే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share