ప‌వ‌న్‌పై కేసీఆర్ కొర‌డా… తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు సీన్ లేన‌ట్టేనా..!

December 18, 2017 at 10:56 am
KCR, Telangana, pawan kalyan, janasena, party, politics,

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏపీలో ఉన్నంత సీన్ తెలంగాణ‌లో ఉండ‌దా?  త‌న పార్టీని ఉరుకులు పెట్టించాల‌ని భావిస్తున్న ప‌వ‌న్‌కు అడుగ‌డుగునా కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తారా? అవ‌స‌ర‌మైతే మ‌రోసారి మ‌న ప్రాంతం-మ‌న పార్టీ నినాదం కూడా లేవ‌నెత్తుతాడా ? ప‌వ‌న్‌కు, ఆయ‌న పార్టీకీ తెలంగాణ‌లో శంక‌ర‌గిరి మాన్యాల గ‌తేనా ? అంటే తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి విశ్లేష‌కులు ఔన‌నే అంటున్నారు. ప్ర‌శ్నిస్తానంటూ హైద‌రాబాద్ వేదిక‌గా 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సొంతంగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు యువ‌త బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అటు సినిమా ప్ర‌భావం కావొచ్చు… లేదా.. ఇటు రాజ‌కీయ చైత‌న్యం కావొచ్చు.. ప‌వ‌న్‌ను అభిమానించేవారు మాత్రం ఎక్కువ‌య్యార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహంలేదు. 

ముఖ్యంగా ఏపీలో ప‌వ‌న్ అంటే “స‌మ‌స్య‌ల‌కు షార్స్ షూట‌ర్‌“- అని ప్ర‌జ‌లు గ‌ట్టిగానే విశ్వ‌సిస్తున్నారు. త‌మ‌కంటూ ఓ దిక్కుంద‌ని ఏ స‌మ‌స్య వ‌చ్చిన చెప్పుకొనేందుకు జ‌న‌సేన కార్యాల‌యానికి బారులు తీరుతున్నారు. రైతుల నుంచి విద్యార్థులు, యువ‌త‌, మ‌హిళ‌లు కూడా జ‌న‌సేన కార్యాల‌యానికి వెళ్లి ప‌వ‌న్‌కు విజ్ఞ‌ప్తులు చేసుకుంటున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ కూడా బాగానే స్పందిస్తున్నారు. కొన్ని ప‌రిష్కారం అయ్యే స‌మ‌స్య‌లు వెంట‌నే అవుతున్నాయి. ఇక‌, ఉద్దానం వంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల విష‌యంలో ప‌వ‌నే నేరుగా ఇన్షియేట్ తీసుకుని మ‌రీ అడుగులు వేయ‌డంతో ఆయ‌న ఇమేజ్ మ‌రింత‌గా పెరిగింది. ఇక‌, ఏపీలో ఇటీవ‌ల నిర్వ‌హించిన మూడు రోజుల సుడిగాలి ప‌ర్య‌ట‌న కూడా ప‌వ‌న్‌కు మ‌రింత క‌లిసివ‌చ్చింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ప్ర‌భుత్వ పాల‌న ప‌రంగా సీఎం చంద్ర‌బాబుపై ఎలాంటి ఘాటు విమ‌ర్శ‌లూ చేయ‌లేద‌నే ఒక్క విమ‌ర్శ త‌ప్ప ప‌వ‌న్ ఆయా స‌మ‌స్య‌ల విష‌యంలో బాగానే స్పందించార‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావించారు. దీంతో ఏపీలో జ‌న‌సేన విస్త‌ర‌ణ‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని లైన్‌లో పెట్ట‌డం వంటివి తేలిక‌గానే జ‌రిగిపోతాయ‌ని అంద‌రూ చెప్పే మాట‌. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే మాత్రం ప‌వ‌న్ ప‌రిస్థితి అంత వీజీకాద‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి తాను ఏ ప్రాంతానికో ప‌రిమిత‌మ‌య్యే వ్య‌క్తిని కాద‌ని ప‌వ‌న్ ప‌దే ప‌దే చెబుతుంటాడు. అదే క్ర‌మంలో ఆయ‌న త‌న పార్టీని కూడా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ విస్త‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రో మాట చెప్పాలంటే.. ఏపీ క‌న్నా ముందుగానే తెలంగాణ‌లోనే పార్టీకి క‌న్వీన‌ర్ల‌ను నియ‌మించుకున్నారు. 

అయితే, ఈ నియామ‌కాలు ఎలా ఉన్నా.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం మాత్రం ప‌వ‌న్‌కు ఇబ్బందేన‌ని తాజా ప‌రిణామాలు వెల్ల‌డిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా హైద‌రాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఫస్టియర్ చదువుతున్న మురళి ఆత్మహత్య విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.  మురళి బలవన్మరణంపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో క‌ల‌క‌లం రేగింది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌ను ముగించుకున్న ప‌వ‌న్‌.. ముర‌ళి కుటుంబాన్ని కూడా ప‌రామ‌ర్శించాల‌ని త‌న షెడ్యూల్‌లో పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే, చివ‌రి నిముషంలో మాత్రం ప్ర‌భుత్వం ఆయ‌న ప‌రామ‌ర్శ‌కు బ్రేకులు వేసేసింది. ఈ నెల 14న ముర‌ళి స్వగ్రామానికి వెళ్లేందుకు ప‌వ‌న్ రెడీ అయ్యారు. 

అయితే ఈ పర్యటనకు చివరి నిమిషంలో పోలీసులు అనుమ‌తిని నిరాకరించారు. దీంతో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న పూర్తిగా నిలిచిపోయింది. దీని వెనుక టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నార‌ని తాజాగా వెలుగు చూసింది. రాజ‌కీయ కోణంలోనే ప‌వ‌న్‌ను ఆయ‌న అడ్డుకున్నార‌ని, ప‌వ‌న్ వెళ్లి.. ఏదైనా వ్యాఖ్య‌లు చేస్తే.. త‌న‌కు ఇబ్బందితోపాటు ప‌వ‌న్‌కు, ఆయ‌న పార్టీకీ మైలేజీ పెరుగుతుంద‌ని కేసీఆర్ భావించి ఉంటార‌ని అంటున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇవే కార‌ణాల‌తో ప‌వ‌న్ ఏ స‌భ పెట్టినా అనుమ‌తి వ‌చ్చే ప‌రిస్థితి దాదాపు ఉండ‌ద‌ని అంటున్నారు. మొత్తానికి ఏపీలో ఉన్నంత జోష్ కూడా ప‌వ‌న్‌కు ఇక్క‌డ లేకుండా చూసేందుకు, ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు సంధించేందుకు కేసీఆర్ త‌న ప‌రివారాన్ని రంగంలోకి దింపినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

ప‌వ‌న్‌పై కేసీఆర్ కొర‌డా… తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు సీన్ లేన‌ట్టేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share