కేసీఆర్ కొరివితో తల గోక్కుంటున్నాడా?

October 7, 2018 at 9:29 pm

తెలంగాణ లో స్థిరపడిన ఆంధ్రవాళ్లను కేసీఆర్ విషపూరితమైన దృష్టితో చూస్తున్నారా? అవకాశం వస్తే చాలు ఆంధ్రా వాళ్ళ పని పట్టాలని అనుకుంటున్నారా? ఏమో తాజా రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే అలాగే అనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతానికి సామాన్య ప్రజల సామాన్యులైన ఆంధ్ర వాళ్లకు పోయినప్పటికీ, ఆంధ్ర నాయకులను ఎడాపెడా దూషిస్తున్న కెసిఆర్ వైఖరి వారిలో గుబులు పుట్టిస్తోంది. తొలి విడత ప్రభుత్వంలో ఆంధ్రుల మీద ఫోకస్ పెట్టలేదు కానీ, ఈసారి గద్దె ఎక్కితే వదిలి పెట్టరని అనుకుంటున్నారు.

కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో స్థిరపడిన ఆంధ్రోళ్ల గురించి ఎంతటి తీవ్రమైన స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారో అందరికీ తెలుసు. ఆంధ్రోళ్ల నాలుకలు కోస్తామని, తరిమితరిమి కొడతామని రకరకాలుగా అన్నారు. తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత.. కేసీఆర్ మాటల్లో తీవ్రత కాస్త తగ్గింది. ఉద్యమపోరాట సమయంలో ఏదో స్ఫూర్తినివ్వడం కోసం కాస్త ఆవేశంగా మాట్లాడానే తప్ప.. తెలంగాణ లో స్థిరపడిన ఆంధ్రా వారైనా సరే, వారు తెలంగాణ బిడ్డలేనని, వారిని సమానంగానే చూసుకుంటాం అని ఆయన తొలి ముఖ్యమంత్రిగా భరోసా ఇచ్చారు. ఆ రకంగా ఆంధ్రోళ్లలో కాస్త శాంతి నెలకొంది. వాతావరణం కూడా నెమ్మదించినట్లే అనిపించింది. కేసీఆర్ పాలనను వారు ఇష్టపడ్డారు. కేసీఆర్ కు దన్నుగా నిలిచారు.

దానికి ప్రతీకగానే.. ఆంధ్రోళ్లు పెద్దసంఖ్యలో స్థిరపడి ఉండే.. హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస అపురూపమైన ఘనవిజయం సాధించింది. రికార్డు సృష్టించింది. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉన్నదని అనుకుంటున్న తరుణంలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. మహాకూటమి రూపంలో విపక్షాలన్నీ జట్టుకట్టడం చూసి కేసీఆర్ అసహనానికి గురవుతున్నారో ఏమో గానీ.. మళ్లీ తన కత్తుల నాలుకకు పనిచెప్పడం ప్రారంభించారు.

తెలంగాణ ఓట్లను ఆకర్షించడం లక్ష్యంగా, ప్రత్యర్థులను తిట్టిపోయడంలో భాగంగా.. కేసీఆర్ మళ్లీ ఆంధ్రోళ్లనే పదాన్ని వాడుతూ ఎడాపెడా దూషిస్తున్నారు. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణ కు ద్రోహం చేశారంటూ మాటలు అంటున్నారు. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా.. హైదరాబాదు నగరం ఇవాళ ఉన్న ఉన్నతమైన స్థితికి చంద్రబాబు, వైఎస్ఆర్ ఇద్దరూ ఎంతో కృషి చేశారన్నది నిజం. కానీ… వారికే ఉన్నవీ లేనివీ ఆపాదించి.. ఆంధ్రోళ్లనంతా కలగలిపి కేసీఆర్ తిడుతున్నారు. ఈ వైఖరి ఆయనకు చేటుచేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆంధ్రోళ్లలో తెరాస పట్ల ఇటీవలి కాలంలో ఏర్పడిన సానుకూల అభిప్రాయాన్ని కేసీఆర్ మళ్లీ చంపేస్తున్నారని, వాళ్ల ఓట్లు పలుప్రాంతాల్లో కీలకంగా ఉండగల నేపథ్యంలో.. ఇది కొరివితో తలగోక్కోవడం వంటి చర్య అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆంధ్రా పాలకులను తిడుతూ, ఆంధ్రా ఓటర్లను మచ్చికచేసుకోవడానికి కేసీఆర్ ఏం ఎత్తుగడ వేస్తారో చూడాలి.

కేసీఆర్ కొరివితో తల గోక్కుంటున్నాడా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share