మ‌మ‌త పంచ్‌తో డైల‌మాలో కేసీఆర్‌… గిదేంది ఇలా జ‌రిగింది…

March 20, 2018 at 11:25 am
KCR, Telangana, TRS, Federal front, mamatha benarji, meet

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ వేసిన మొదటి అడుగు సక్సెస్ అయ్యిందా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ బెడిసికొట్టిందా.. అసలు సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలన్నింటినీ విలేకరుల సమావేశంలో చెప్పారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఈ ప్రశ్నలు తలెత్తడానికి విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడిన తీరే కారణంగా పలువురు నేతలు భావిస్తున్నారు. దేశంలో  ఫెడరల్ ఫ్రంట్ అవసరమనీ, కాంగ్రెస్, బీజేపీలక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అనివార్యంగా పైకి ఇద్దరు నేతలు చెబుతున్నా.. నిజానికి ఎవరి వ్యూహంలో వారు ఉన్నట్లుగా.. అంతర్గతంగా ఒకరు కాంగ్రెస్ కు, మరొకరు బీజేపీకి సానుకూలంగా ఉంటున్నట్లుగా తాజా పరిస్థితులు చెబుతున్నాయి. 

 

ఇటీవల ఢిల్లీలో యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విపక్షాల నేతలకు విందు ఏర్పాటు చేశారు. మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా ఆమె రంగంలోకి దిగారు. ఈ విందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు గానీ పార్టీ నేతలను పంపారు. ఇక సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు మమతా బెనర్జీ దాటవేత ధోరణితో సమాధానం చెప్పారు. కాంగ్రెసేతర కూటమి వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రశ్నను ఆమె తోచిపుచ్చడం గమనార్హం. 

 

ఇలా ఆమె తక్షణమే సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వకుండా.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ తేల్చి చెప్పడంతో అటు టీడీపీ, ఇటు వైఎస్సార్ సీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాయి. 

 

సోమవారం ఈ రెండు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. సభ సజావుగా సాగేందుకు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని కోరినా టీఆర్ఎస్ ఎంపీలు, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఇదే విషయాన్ని మమతా బెనర్జీ సీఎం కేసీఆర్ తో ప్రస్తావింనట్లు సమాచారం. బీజేపీ కి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని చెబుతున్న మీరు లోక్ సభలో బీజేపీకి సానుకూలంగా ఉంటున్నారనే విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. 

 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ టీఆర్ఎస్ ను, అన్నాడీఎంకేను పావుగా వాడుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్న తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ లు అంతర్గతంగా ఆ పార్టీలతోనే అంటకాగుతున్నాయనే వాదనకూడా వినిపిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో తటస్థంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. ఏదేమైనా తాను వెళ్లిన వెంట‌నే మ‌మ‌త తాను చెప్పిన‌ట్టు త‌ల ఊపేస్తుంద‌ని అనుకున్న కేసీఆర్‌కు ఆమె మామూలు షాక్ అయితే ఇవ్వ‌లేదు. 

 

మ‌మ‌త పంచ్‌తో డైల‌మాలో కేసీఆర్‌… గిదేంది ఇలా జ‌రిగింది…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share